KCR Uddav Thackre Meeting :

దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించేందుకే మ‌హారాష్ట్ర‌కు వ‌చ్చానని, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై మహారాష్ట్ర సీఎంతో చ‌ర్చించామన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్రం తరువాత దేశంలోని పరిస్థితులు మారాల్సి వున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రం రాష్ట్రాలపై చేస్తున్న జులం కు వ్యతిరేకంగా  ఇతరులతో కలిసి పనిచేయాల్సి వున్నదన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం 11.40 గం.లకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి ముంబై కి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం కేసిఆర్ వెంట..ఎమ్మెల్సీ కవిత, ఎంపీ లు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి.పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి వున్నారు. మధ్యాహ్నాం 12.50 కి ముంబై విమాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం గ్రాండ్ హయత్ హోటల్ కి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధికారిక నివాసం ‘వర్ష’ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ కి తన అధికార నివాసంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే లంచ్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం లంచ్ తరువాత ఇద్దరు సీఎం ల మధ్య గంటన్నర పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఇరువురు సీఎం లు సయుక్తంగా మీడియా సమావేశం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ…

దేశ అభివృద్ధి, తాజా రాజకీయాలు సుదీర్ఘంగా చర్చించామని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చేపట్టేందుకు, విధి విధానాలను మార్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పై సమాలోచనలు చేశామన్నారు. …‘‘ మహారాష్ట్రతో దాదాపు 1000 కిలోమీటర్ల సరిహద్దును తెలంగాణ పంచుకుంటున్నది. భవిష్యత్తులో కూడా ఇరు రాష్ట్రాలు చాలా విషయాల్లో కలిసి పనిచేయవలసి వున్నది. దేశ రాజకీయాల్లో 75 ఏండ్ల తర్వాత అనేక మార్పులు రావల్సివుండే కాని జరగలేదు. దేశంలో పరివర్తన కావాల్సినదనే విషయంలో మాకు సమ్మతి కుదిరింది. దేశ సమగ్రతకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరమున్నది.పటిష్టమైన దేశ భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలి. మా చర్చలో అన్ని విషయాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఆ దిశగా ముందుకు కలిసి నడవాడానికే నిర్ణయించుకున్నాం. ఇతర నేతలతో కూడా చర్చిస్తాం. అతి త్వరలో హైదారబాద్ లేదా మరోచోట అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతాం. మార్గాలు వెతుకుతాం. మేము ఇతరులతో కూడా కలిసి పనిచేస్తాం. శివాజీ, బాల్ థాకరే లాంటి యోధులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా కలిసి పనిచేయాల్సి వున్నది. ఉద్దవ్ థాకరే మాకు ప్రేమతో భోజనం పెట్టారు. మహారాష్ట్ర ప్రజల ఆథిత్యం గొప్పగా వున్నది. మేము దాన్ని మూటకట్టుకొని పోతున్నం. హైదారాబాద్ రావాలని సీఎం ఉద్దవ్ ను ఆహ్వానిస్తున్నాం..’’
అని సిఎం కెసిఆర్ అన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర రెండు సోదర రాష్ట్రాలని, రెండూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పలు అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణల మధ్య వెయ్యి కిలోమీటర్ల బోర్డర్ ఉందని, ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసి పనిచేస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి బంధం ఉందని, ఈ బంధాన్ని దేశాన్ని ఏకం చేయడానికి ఉపయోగిస్తామన్నారు. దేశ హితం కోసం కేసీఆర్ తో కలిసి నడుస్తామన్నారు. మాతో కలిసి వచ్చే నేతలతో విధానపరమైన మార్పుల కోసం పోరాడతామన్నారు. మా చర్చల్లో రహస్యమేమీ లేదని, దేశంలో మార్పు కోసం ఏదైనా బహిరంగంగానే చేస్తామన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక సమస్యలున్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచివి కావని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న కూటమిలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదా అని అడిగిన రిపోర్టర్ ప్రశ్నకు సీఎం కెసిఆర్ సమాధాన మిస్తూ…… “ నేను మీకో విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలతో ఒక ఆరంభం లభించింది. దేశంలోని ఇతర నాయకులతో మేము చర్చలు జరుపుతాం. ఏ రకంగా ముందుకు సాగాలనే విషయంలో ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వస్తాం. దేశం ముందు పెడతాం” అని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుడు మార్గంలో వినియోగించుకుంటున్నదని మీరు భావిస్తున్నారా అనే రిపోర్టర్ ప్రశ్నకు సీఎం కెసిఆర్ సమాధానమిస్తూ… “కేంద్ర ప్రభుత్వ సంస్థల తప్పుడు వినియోగం జరుగుతున్నది..నిజమే. కానీ అలా జరగకూడదు. ఇది సరైంది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి. లేకపోతే భవిష్యత్ లో ఈ ఫలితాన్ని వారు అనుభవిస్తారు. దీంట్లో పోయేదేం లేదు. దేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసింది” అని అన్నారు.

 

KCR Uddav Thackre Meeting

మహారాష్ట్ర సీఎం తో భేటీ ముగిసిన అనంతరం సౌత్ ముంబై లోని నేపియన్ సీ రోడ్డులో గల ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ బృందాన్ని శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే సాదరంగా ఆహ్వానించారు. శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు దేశ వ్యవసాయ రంగం తదితర దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాల పై ఇరువురు నేతలు చర్చించారు.

అనంతరం సీఎం కేసీఆర్, శరద్ పవార్ ల సంయుక్త మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘అతిపిన్న వయస్సులో సీఎం గా పనిచేసిన నేత, భారత రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న నేతగా శరద్ పవార్ ను అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటులో పవార్ ఇచ్చిన మద్ధతును మరువలేమని, 1969 నుంచి పవార్ తెలంగాణ ఉద్యమానికి సహకరించారన్నారు. శరద్ పవార్ కు తెలంగాణ ప్రజల తరఫున తన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…‘‘ దేశంలో పాలన సరైన రీతిలో సాగడం లేదని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా అనుకున్న రీతిలో అభివృద్ధి జరుగలేదు. దానికోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కలిసి పనిచేయాల్సిన విషయం పై ఏకాభిప్రాయం కుదిరింది. భావసారూప్యం గల పార్టీల నేతలతో త్వరలో సమావేశం నిర్వహిస్తాం.‘’ అని సిఎం అన్నారు. దేశానికి కొత్త ఎజెండా అవసరమని తాము భావించినట్లుగా తెలిపారు. అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు పెడతామన్నారు.

అనంతరం శరద్ పవార్ ,మాట్లాడుతూ.. ‘‘ దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందని, సంక్షేమ పథకాలతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.అదే స్పూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని పవార్ అన్నారు.

KCR Uddav Thackre Meeting

శరద్ పవార్ నివాసంలో జరిగిన పత్రికా సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. దేశ రాజకీయాల్లో, అభివృద్ధిలో గుణాత్మకమైన మార్పు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం రాత్రి 7.20 నిమిషాలకు ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ కు తిరుగు ప్రయాణమైన సిఎం కెసిఆర్ తన బృందంతో 8.30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడనుంచి ప్రగతిభవన్ తన అధికారిక నివాసానికి చేరుకున్నారు.

KCR Uddav Thackre Meeting
మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాకరే తో భేటీ సందర్భంగా.. సిఎం కెసిఆర్ వెంట వెల్లిన వారితో పాటు ., మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఎంపీలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి ఆశిష్ కుమార్ సింగ్, సిఎం థాకరే కుమారుడు తేజస్ థాకరే, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులున్నారు.అనంతరం శరద్ పవాద్ తో సిఎం కెసిఆర్ భేటీ సందర్భంగా… ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ వెంట వెల్లిన వారితో పాటు., శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే, ఎంపీ ప్రఫుల్ పటేల్, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *