తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు – సవాళ్లు అనే అంశం పై హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కేరళ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థలు, ఎక్సైజ్ మరియు ప్రోహిబిషన్ శాఖల మంత్రి ఎం బి రాజేష్ ముఖ్య, విశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేరళ – తెలంగాణ రాష్ట్రాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎం బి రాజేష్ ల కామెంట్లు
ఇజిఎస్ లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నది. ఇజిఎస్ లో ఇప్పటి వరకు మనం దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నాం. కానీ, కావాలనే మనల్ని కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సమస్యలు సృష్టించి, మొత్తం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్ర పన్నుతున్నది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఇలాగే కక్ష కట్టి గత ఆరు నెలల నుండి ఉపాధి హామీ పథకాన్ని ఆ రాష్ట్రంలో నిలిపివేశారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలైన చత్తీస్ గడ్, రాజస్థాన్, పంజాబ్ ఇప్పటికే… పర్యవేక్షక టీం లను పంపించి, లేనిపోని ఆరోపణలు మొదలు పెట్టారు. మన తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2018 వరకు కేవలం 3 టీం ల ను పంపిస్తే, ఈ ఏడాది 18 టీం లను పంపించి లేని తప్పులను ఎత్తి చూపి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. ఉపాధి హామీ పథకం (పూడిక తీత) మొదలైనప్పటి నుంచి చెరువుల్లో కేవలం పూడిక తీత తీస్తున్నారు. కానీ, ఇన్నేండ్ల తర్వాత పూడిక తీత ఎక్కువ తీయొద్దని చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఈ పనులు కేవలం. 11శాతంగా ఉన్నాయి కానీ, ఆంధ్రప్రదేశ్ 19శాతం, చత్తీస్ గడ్ 18శాతం, పంజాబ్ 20శాతం, గుజరాత్ 16శాతం చేస్తే మాత్రం చప్పుడు లేదు. పైగా, మొక్కలు పెడితే ఎందుకు? అంటోంది?
హరిత హారంలో మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేయడంలో మల్టీ లేయర్లలో మొక్కలు పెడితే, ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. వెదురు కంచెలు వేయాలని చెబుతున్నారు. మన దగ్గర కోట్లాది మొక్కలకు నాటడానికి లభ్యత ఉందా? లేదు. హరిత హారం వల్ల 7.5శాతం పచ్చదనం పెరిగిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి. మొక్కలు పెంచడండ వల్ల గత రెండు, మూడు ఏండ్ల నుండి వర్షాలు సకాలంలో పడుతున్నాయి. పచ్చదనం మొదలైతే, తెలంగాణ బార్డర్ వచ్చిందని ఇతర రాష్ట్రాల లారీ డ్రైవర్లు చెబుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. రైతు కల్లాలు ఎందుకు? రైతులకు అవసరమా? అంటోంది. రైతు కల్లాలు కడితే, అది అనుమతి లేని పని అంటున్నారు కానీ, తీర ప్రాంత రాష్ట్రాల్లో చేపలు, రొయ్యలు ఎండ బెట్టుకోవడానికి అనుమతిస్తున్నారు. కాళేశ్వరం మరియు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల దేశంలోనే నెంబర్ వన్ గా విపరీతమైన పంటలు పండిస్తున్నాం. ఆ పంటలను ఆరబెట్టుకోవడానికి రైతులకు కల్లాలు కడితే వద్దంటున్నారు. రైతు వేదికలు ఎందుకు కట్టారని అంటోంది.
పేద ప్రజలకు కడుపు నింపే ఈ పథకాన్ని కూడా నీరు గార్చారు. గతంలో పనికిరాని పనులు చేసే వారు. చెరువుల్లో మట్టి తీసి, ఫార్మేషన్ రోడ్లు నామ్ కే వాస్తే చేసే వాళ్ళు. తెలంగాణ వచ్చాక శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాం. సిసి రోడ్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, హరితహారం వంటి ఎన్నో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేస్తున్నాం. గ్రామంలో 20 పనులకు మించి ఎంపిక చేయవద్దంటోంది. అంతకంటే ఎక్కువ పనులు చేపడితే బ్లాక్ లిస్టులో పెడుతోంది. ఇంతకుముందు పేద కూలీలకు గడ్డపార, తట్ట మొదలైన పని ముట్లు ఇచ్చే వాళ్ళం. కానీ, ఇలాంటి సౌకర్యాలకు కూడా కేంద్రం కోత పెట్టింది
పేద కూలీల కోసం ఏ సౌకర్యం కల్పించాలన్నా, కేంద్రం అడ్డు పడుతున్నది. అలాగే, దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో తగ్గించడం జరిగింది. దీన్ని ఇంకా తగ్గించి, ఉపాధి హామీ పథకాన్నే రద్దు చేసి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. దీని వల్ల మన రాష్ట్రానికి 800 కోట్ల వరకు నష్టం ఏర్పడింది. నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయలేదు. నేను ఎన్ని సార్లు లెటర్లు రాసినా, సిఎం గారు ప్రధానమంత్రికి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. ఈ సెమినార్ లో సీపీఎం జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘాల బాధ్యులు, పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కేంద్ర అవార్డులే కెసిఆర్ పాలనకు నిదర్శనం : ఎర్రబెల్లి