Saturday, November 23, 2024
HomeTrending Newsకేశినేని అలక వీడారా?

కేశినేని అలక వీడారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నగర నేతల తీరుతో మనస్తాపం చెంది రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన నిర్ణయం మార్చుకున్నట్లు కనబడుతోంది. పార్టీ ఆఫీసుపై దాడిని నిరసిస్తూ చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షలో కేశినేని నిన్న పాల్గొని ప్రసంగించారు. ఆయన్ను మరో ఎంపీ, యువనేత  కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వేదికపైకి తోడ్కొని వచ్చారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కేశినేని ఒక్కసారిగా వేదికపైకి రాగానే కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసి ఆహ్వానించారు.  అయితే ఆ సమయంలో నాని ని వ్యతిరేకిస్తున్న నగర నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, నాగూల్ మీరా అక్కడ లేకపోవడం గమనార్హం.

నగర పాలక ఎన్నికల్లో సొంత పార్టీ నేతల తీరుతో నొచ్చుకున్న నాని, దీనిపై చంద్రబాబు సరిగా స్పందించలేదని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అప్పటి నుంచీ అయన పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, కొత్త అభ్యర్థిని చూసుకోవాలని నెలరోజుల క్రితం నాని చంద్రబాబుకు వర్తమానం పంపారు. తన కుమార్తె, విజయవాడ నగర పాలక సంస్థలో కార్పొరేటర్ గా ఉన్న శ్వేత కూడా క్రియాశీలకంగా ఉండబోరని, ఆమె టాటా ట్రస్ట్ ఉద్యోగానికి తిరిగి వెళుతున్నారని కూడా నాని చెప్పారు. తాజాగా గత వారం నాని ఆఫీస్ కేశినేని భవన్ లో చంద్రబాబు ఫోటోలు సైతం తొలగించి ఆ స్థానంలో రతన్ టాటా తో దిగిన ఫోటోలు పెట్టిన సంఘటన  నాని టిడిపితో పూర్తిగా తెగదెంపులు చేసుకోనున్నరనే వార్తకు మరింత వూతమిచ్చింది.

అయితే హఠాత్తుగా కేశినేని పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం పార్టీలో అయన ప్రత్యర్థులకు మింగుడుపడడం లేదని చెప్పొచ్చు. నిన్న చంద్రబాబుతో కేశినేని రహస్య మంతనాలు జరిపినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాని పార్టీలో క్రియాశీలకంగా ఉండేట్లుగా రామ్మోహన్ నాయుడు సంధానకర్తగా వ్యవహరించారని సమాచారం. దీనిపై నాని ప్రత్యర్థులు ఎలా స్పందిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్