Saturday, November 23, 2024
Homeసినిమాఆడియన్స్ కి కావాల్సినంత కథనే లేదు!

ఆడియన్స్ కి కావాల్సినంత కథనే లేదు!

Movie Review: ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం, వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళుతుండటం విశేషమే. చాలా ఫాస్టుగా  సినిమాలను చేసేస్తూ .. వాటిని థియేటర్లలో దిగబెడుతూ మిగతా కుర్ర హీరోలకు కంగారు పుట్టిస్తున్నాడు. నిదానంగా పెద్ద బ్యానర్లలో కూడా చేస్తూ, హీరోగా కుదురుకోవడానికి గట్టిగానే  కష్టపడుతున్నాడు. ఆయన నుంచి ఈ శుక్రవారం వచ్చిన సినిమానే ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘. ఈ టైటిల్ చూసి ఈ సినిమాలో హీరో సేవా కార్యక్రమాలు గట్రా చేస్తాడేమోనేని అనుకుంటే పొరపాటే. హీరోయిన్ ఫ్యామిలీకి ఆయన బాగా  కావాల్సినవాడనే విషయం అర్థం చేసుకోవాలి.

వైజాగ్ లో పద్ధతిగల కుటుంబంలో పుట్టి పెరిగిన తేజు ( సంజన ఆనంద్) హైదరాబాద్ లోని ఒక సంస్థలో జాబ్ చేస్తూ ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న వికాస్ (కిరణ్ అబ్బవరం) ఆమెను ప్రతి రోజూ పికప్ చేసుకుని .. డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆమె ప్రతి రోజూ విపరీతంగా  తాగుతుండటం చూస్తాడు. లవ్ అనే మాట వినగానే ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతూ ఉండటం గమనిస్తాడు. ఒక శుభ ముహూర్తం చూసుకుని, ఆమె అలా చేయడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్పే కళ్లు తిరిగిపోయే కథనే ఈ సినిమా.

హీరోయిన్ సమస్య ఏమిటో తెలుసుకున్నాక ఏ హీరో మాత్రం ఊరుకుంటాడు? వెంటనే రంగంలోకి దిగిపోడూ. ఇక్కడ ఈ హీరో కూడా అదే పనిచేస్తాడు. కాకపోతే ఎలా చేస్తాడు? ఏం చేస్తాడు? అనేదే ఆడియన్స్ కి కావలసింది. ఈ సినిమాకి శ్రీధర్  గాదె దర్శకత్వం వహించాడు. ఆయన తయారు చేసుకున్న కథ .. దానిని నడిపించిన విధానం అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇలాంటి కథలు ఆల్రెడీ వచ్చివెళ్లినవే. కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్లే – మాటలు కూడా అందించాడు. కానీ ఆ వైపు నుంచి ఆయనకి క్రెడిట్ ఇవ్వలేం. ఎందుకంటే ఈ కథ చాలా సాదాసీదాగా సాగిపోతుంది కాబట్టి

ఒక హీరో .. హీరోయిన్ తో ఆడిపాడకుండా, మరొకరితో ఆమె కొనసాగించిన ప్రేమాయణం గురించి వింటూ ఇంటర్వెల్ వరకూ కూర్చుంటే ఆ కథ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకుంటా. ఆ వెంటనే హీరోను అర్థం చేసుకుని ఆ హీరోయిన్ దగ్గరవుతుందా అంటే .. అవుతుంది. కాకపోతే అప్పటికి మనం క్లైమాక్స్ కి దగ్గరగా వచ్చేస్తాం. హీరో .. హీరోయిన్ పాత్రలను తప్ప, ఇతర పాత్రలను పట్టించుకోలేదు . అందులో ఎస్వీ కృష్ణారెడ్డి పాత్ర కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ లో మరింత ఈజ్ చూపించాడు .. మాస్ స్టెప్పులు బాగా వేశాడు. అక్కడక్కడ ట్విస్టులు ఉన్నాయి .. కాకపోతే కథనే కావాల్సినంత లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్