కిరణ్ అబ్బవరం నుంచి ఆ మధ్య వరుస సినిమాలు వచ్చాయి. ఆయన లైన్లో పెడుతున్న ప్రాజెక్టులను చూసి జనాలు షాక్ అయ్యారు. బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడని అనుకున్నారు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి గట్టిగానే సెర్చ్ చేశారు కూడా. కానీ తనకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదనీ, సినిమా అంటే ఉండే తపన వల్లనే తాను వరుస అవకాశాలను అందుకుంటూ ఉన్నానని కిరణ్ చెప్పుకుంటూ రావలసి వచ్చింది. ఈ విషయాన్ని అందరూ నమ్మడానికి కొంత సమయం పట్టింది.
వరుస సినిమాలు చేయడం కంటే, అదే స్థాయిలో సక్సెస్ ను సాధించడం ముఖ్యమనే విషయం కిరణ్ కి అర్థమైంది. అప్పటికే కొన్ని ఫ్లాపులు తన ఖాతాలోకి చేరడం వలన వచ్చిన అనుభవం ఆయనను ఆలోచింపజేసింది. అందువల్లనే ఆయన తన స్పీడ్ తగ్గించి కథలపై దృష్టి పెట్టాడు. కథా కథనాలపై కిరణ్ కి మంచి అవగాహన ఉంది. అందువలన ఆయన కొంత సమయం తీసుకుని, ‘క’ అనే సినిమా చేశాడు. ఇదే పేరుతో సొంత బ్యానర్ ను మొదలుపెట్టి, నిర్మాతగా కూడా మారిపోయాడు.
కొంతకాలంగా జరుగుతూ వస్తున్న ఈ సినిమా, రీసెంటుగా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకుంది. సుజీత్ – సందీప్ అనే కుర్రాళ్లు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయమవుతున్నారు. ‘ఆయ్’ .. ‘గం గం గణేశా’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ‘నయన్ సారిక’, ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన కిరణ్, నిర్మాతగానూ సక్సెస్ అవుతాడేమో చూడాలి.