Rahul is back: కెప్టెన్ కెఎల్ రాహుల్ సెంచరీతో అజేయంగా నిలవడంతో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగులతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. భారీ లక్ష్యమైనా విజయం కోసం ముంబై చివరకూ పోరాడింది.
ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఓపెనర్లు కెఎల్ రాహుల్, డికాక్ లు మొదటి వికెట్ కు 52 పరుగులు చేశారు. డికాక్ 13 బంతుల్లో 24 పరుగులు (నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) చేశాడు. రెండో వికెట్ కు మనీష్ పాండే-రాహుల్ 72 పరుగులు జోడించారు. పాండే 39 పరుగులు చేహ్సాడు. స్టోనిస్(10); దీపక్ హుడా(15) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. రాహుల్ 60 బంతుల్లో 9 ఫోర్లు; 5 సిక్సర్లతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ రెండు; మురుగన్ అశ్విన్, ఫాబియన్ అల్లెన్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16 పరుగులకే తొలి వికెట్ (రోహిత్-6) కోల్పోయింది. తర్వాత వచ్చిన డేవిడ్ బ్రేవిస్ లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 13 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 31 పరుగులు చేసిన బ్రేవిస్ ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (13) కూడా పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్-37; తిలక్ వర్మ-26; పోలార్డ్-24 దూకుడుగా ఆడినా క్రీజూలో నిలదొక్కుకోలేకపోయారు. చివర్లో ఉనాద్కత్, మురుగన్ అశ్విన్ లు ధాటిగా ఆడినా ఇద్దరూ రనౌట్ కావడంతో ముంబై ఓటమి తప్పలేదు. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ మూడు; జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, స్టోనిస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కెఎల్ రాహుల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం