అధికారంలోకి వస్తే ఏదో చేస్తానంటున్న చంద్రబాబు, గత 14 ఏళ్ళ పాలనా కాలంలో ఎందుకు చేయలేకపోయారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిన్న ప్రకటించిన హామీల్లో… అమ్మ ఒడి ని తమ పార్టీ నుంచి కాపీ కొట్టారని, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ను కాపీ కొట్టి మరికొన్ని ప్రకటించారని, పైగా ‘అదిరిందా తమ్ముళ్ళూ’ అంటూ అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో కొడాలి మాట్లాడారు. బిసిలు ఎన్టీఆర్ ను దైవంగా భావించేవారని, ఆ కులాలను రాజకీయంగా, ఆర్ధికంగా పైకి తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. బిసిలు తమ పార్టీకి వెన్నెముక అని చెబుతున్న చంద్రబాబుకు ఇంకా పవన్ కళ్యాణ్ తో పనేముందని, బాబు నమ్ముకునే మీడియా అధిపతులు బిసిలా అని నాని నిలదీశారు. బిసిలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి కాదని ఎన్టీఆర్ కు వెన్నెముక అని అభివర్ణించారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కానందుకు జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, ఆయన తల్లిపై కూడా ఆ పార్టీ సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు పెడుతున్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను ఏమీ అనకపోయినా… ఏదో అన్నారని వెక్కి వెక్కి ఏడ్చిన బాబుకు, ఈ విషయం తప్పని అనిపించలేదా అని నాని నిప్పులు చెరిగారు.
ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల పేరిట నిర్వహించిన మహానాడు వేదికపై ఎన్టీఆర్ వారసుల ఫొటోలు ఎందుకు పెట్టలేదని, దీనిపై టిడిపి నాయకులు ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదని నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరిట నాలుగు ఓటు సంపాదించుకోడానికే తపన పడుతున్నారని, ఎంత సేపూ సిఎం జగన్ ను తిట్టడానికి, బాబును ఇంద్రుడు చంద్రుడంటూ పొగడటానికే ఈ సభను ఉపయోగించుకున్నారని విమర్శించారు.
నాడు వైఎస్, నేడు జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల పైనా….. చంద్రబాబు ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు రావాలని కొడాలి సవాల్ విసిరారు. అన్నీ ఉచితంగా ఇస్తానని 2009లో చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రజలు నమ్మలేదని, అందుకే నాడు వైఎస్ ‘ఆల్ ఫ్రీ బాబు’ అంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. 2019ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల్లో పది శాతంకూడా అమలు చేయలేదని, రైతు రుణమాఫీ, మహిళా సంఘాల రుణాల మాఫీ, ఆరోగ్య శ్రీ హామీలు నిలబెట్టుకోలేకపోయారని… నిరుద్యోగ భ్రుతి ఇస్తానని చెప్పి పదవి నుంచి దిగిపోడానికి రెండు నెలల ముందునుంచే మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. పెన్షన్ల పెంపు పై కూడా చివర్లో నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ మేనిఫెస్టోను ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేయడం దురదృష్టకరమని, బాబు పుట్టినరోజు ఏప్రిల్ 20న.. విడుదల చేస్తే 420గా బాగుండేదని వ్యాఖ్యానించారు.