వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఓడించలేరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ ను మాజీ సిఎం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో చూసుకోవాలని సవాల్ విసిరారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదివే పవన్ మమ్మల్ని భయపెట్టలేరని, అయన ప్రసంగాలకు జనం భయపడతారని, జగన్ నాడు సోనియాగాంధీకే భయపడలేదని నాని గుర్తు చేశారు.
దేశంలోనే ఒక రాజకీయ పార్టీ స్థాపించి రెండు చోట్ల పోటీ చేసి రెండిటా పరాజయం పొందిన అరుదైన రికార్డు పవన్ సొంతం చేసుకున్నారని నాని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2 జడ్పీటీసీలు, 160 ఎంపీటీసీలు గెల్చుకొని ఈ బలంతో ఏదోదో ఊహించుకుంటున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. గత ఎన్నికల్లో మాయావతి పార్టీతో పొత్తుపెట్టుకొని దళితుల ఓట్లు చీల్చి జగన్ ను ఓడించాలని చూశారని చెప్పారు.
జగన్ ఇతర పార్టీల మీద, వ్యక్తుల మీద ఆధారపడి రాజకీయాలు చేయబోరని నాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను, దేవుణ్ణి నమ్మి మాత్రమే రాజకీయాలు చేస్తారని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా జగన్ సింగిల్ గానే వస్తారని…పవన్ కళ్యాణ్ బిజెపితో పాటు తెలుగుదేశం అవసరమైతే కాంగ్రెస్ తో కూడా కలిసి రావాలని కొడాలి నాని సూచించారు.