పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఇడుపులపాయకు హైవే వేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం వేయాలని, దానిపై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి పదవి కోసం పవన్, కేఏ పాల్ పోటీ పడుతున్నట్లు ఉన్నారని అన్నారు. 300 ఎంపీ సీట్లు సాధించి పవన్ ప్రధాని అవుతారేమో, అలా అయిన తరువాత ఇడుపులపాయతో పాటు గుడివాడలో కూడా హైవే వేసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. నేడు ఇప్పటం పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి స్పందించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు వారి సొంత సమస్యలతో సతమతమవుతున్నారని, వారు పనికొచ్చే రాజకీయాలు ఏ ఒక్కటీ చేయడంలేదని మండిపడ్డారు.
హైదరాబాద్ లో ఎవరో ముగ్గురు తాగుబోతులు పబ్ కు వెళ్లి వస్తూ పవన్ ఇంటి ముందు గొడవపడితే, దానిపై రెక్కీ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడారని విమర్శించారు. బాడుడే బాదుకు కార్యక్రమానికి వచ్చారు కాబట్టి బాదకపొతే చంద్రబాబు బాధపడతారన్న ఉద్దేశంతో ఎవడో ఒకరు రాయి వేసి బాదారని నాని ఎద్దేవా చేశారు. దాడుల పేరుతో ప్రజల్లో సానుభూతి రాజకీయాలు చేయాలనుకుంటున్నారన్నారు.
మునుగోడు ఎన్నికల్లో కేఎపాల్ వినోదంతో రక్తి కట్టించారని, అది పవన్ కు నచ్చినట్లుందని, పాల్ లాగే ఉరుకులు, పరుగులు పెట్టారని, పోలీసులు ఆపుతున్నా పరిగెత్తుకుంటూ ఇప్పటం వెళ్ళారని, అక్కడ షో చేసి మళ్ళీ రెండు గంటలకు బయల్దేరి వెళ్లిపోయారని నాని దుయ్యబట్టారు. ఇప్పటం గ్రామ ప్రజల కోరిక మేరకే రోడ్డు విస్తరణ చేపట్టారని, స్థలం కోల్పోయిన వారిలో అన్ని కులాల వారూ ఉన్నారని, ఒక రోడ్డులో ఒకే కులం వారు ఉంటారా అని నాని సూటిగా అడిగారు.
నిర్ణయాత్మక ప్రతిపాక్ష పాత్ర పోషించడంలో రెండు పార్టీలూ విఫలమయ్యారన్నారు. ఈ మూడేళ్ళలో ఒక్క ప్రజా సమస్యపైనైనా వీరు పోరాటం చేశారా అని నాని నిలదీశారు. నిత్యావసర వస్తువుల పెరుగుదల కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెరిగితే వారిపై విమర్శించే దమ్ము లేక జగన్ ను విమర్శిస్తున్నారని నాని అన్నారు. నలభై ఏళ్ళ రాజకీయం ఉన్న చంద్రబాబుకు డీజిల్, పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారో తెలియదా అని నాని దుయ్యబట్టారు.