చెస్ వరల్డ్ కప్ లో పాల్గొనకూడదని తెలుగు తేజం కోనేరు హంపి నిర్ణయించుకున్నారు. జూలై 10 నుంచి రష్యాలోని సోచిలో ఈ ఈవెంట్ జరగనుంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు ఆమె నిన్ననే అర్హత సాధించారు. క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు ఎంపిక అయి ఉండకపోతే వరల్డ్ కప్ లో పాల్గొని ఉండేదాన్నని, కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ౩౦౦ మంది ఆటగాళ్ళు, ఇతర సిబ్బంది తో కలిసి మ్యాచ్ లు ఆడడం సరికాదని భావిస్తున్నట్లు హంపి చెప్పారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో రష్యా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
ఫిడే అధ్వర్యంలో జరిగిన చెస్ గ్రాండ్ ప్రి పోటీల్లో మొదటి దానిలో హంపి విజేతగా నిలిచారు, రెండో మ్యాచ్ టై అయ్యింది. మూడో టోర్నీకి హంపి హాజరు కాలేదు, నాలుగో టోర్నీ జిబ్రాల్టర్ లో జరగ్గా కోవిడ్ కారణంగా వెళ్లలేకపోయారు. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించారు.
గత ఏడాది ఫిబ్రవరి నుంచి టోర్నీలు ఆడలేదని, అతి త్వరగా అట ఆడాలని తనకూ ఉందని, కానీ కోవిడ్ కారణంగా వరల్డ్ కప్ కు వెళ్ళడంలేదని వివరించారు. వచ్చేఏడాది ప్రథమార్ధంలో జరిగే గ్రాండ్ స్విస్ టోర్నీకి అడతానన్న ఆశాభావం హంపి వ్యక్తం చేశారు.
మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ కూడా వరల్డ్ కప్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ మన దేశం నుంచి పెండ్యాల హరికృష్ణ, విదిత్, అధిబన్, ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, వైశాలి, భక్తీ కులకర్ణి, ఇనియాన్ లను పంపాలని అల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆలోచిస్తోంది.