తెలుగు తేజం, చెస్ లో ప్రపంచ ఖ్యాతి సాధించిన కోనేరు హంపిని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఏ ఐ సి ఎఫ్) ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ చేసింది. 34 ఏళ్ళ హంపి వరల్డ్ చెస్ లో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. చెస్ లో హంపి ప్రదర్శించిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు తాజాగా ఆమె ఖేల్ రత్నకు నామినేట్ అయ్యారు.
విదిత్ ఎస్. గుజ్రాతి, ఎమ్మార్ లలిత్ బాబు, భాస్కరణి, ఎస్పీ సేతు రామన్, పద్మిని రౌత్, భక్తి కులకర్ణి లు అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు, కోచ్ అభిజిత్ కుంతే ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన చాంద్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్-¬2021 కోసం వివిధ క్రీడాంశాల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీని జూన్ 21 నుంచి జూలై 5 వరకు కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ పొడిగించిని విషయం తెలిసిందే. టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్ తదితర క్రీడలకు గాను ఆయా ఫెడరేషన్లు ఇప్పటికే నామినేషన్లు అందజేశారు. నేడు చెస్ ఫెడరేషన్ కూడా నామినేషన్లు పంపింది. అన్ని విభాగాల నుంచి నామినేషన్లు అందిన తరువాత క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలించి కొన్ని పేర్లను అవార్డులకు సిఫార్సు చేస్తుంది.
కాగా, న్యూజెర్సీలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అభిమన్యు మిశ్రా 12 ఏళ్ళ వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎంపికై అత్యంత పిన్న వయసులో ఈ హోదా సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.