కొరటాల శివలో ఒక ప్రత్యేకత ఉంది. కథ చెప్పడంలోను .. తెరపైకి దానిని తీసుకురావడంలోను ఒక స్పష్టత కనిపిస్తుంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందనగానే అందరిలో ఒక రకమైన ఆసక్తి తలెత్తుతుంది. తన సినిమాలకి ఆయనే రచయిత. అందువలన కథ .. స్క్రీన్ ప్లే .. డైలాగ్స్ విషయంలోను తన ముద్ర కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ గా అనిపిస్తూనే గాఢత ఎక్కువగా ఉండే డైలాగ్స్ రాయడం ఆయనకి గల మరో ప్రత్యేకత.
అలాంటి కొరటాల తాజా చిత్రంగా ‘దేవర’ రూపొందుతోంది.టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. అలాంటి ఈ సినిమాలో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇంతవరకూ ఎన్టీఆర్ కనిపిస్తూ వచ్చిన దానికి భిన్నంగా ఈ సినిమాలో లుక్ ఉండనుంది. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ ను మార్చారు. ఇక హీరో .. హీరోయిన్స్ కి సంబంధించిన ఫస్టులుక్స్ ముద్రం నేపథ్యంలోనివి కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సముద్రం నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందని కొరటాల చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది. తానుండగా సముద్రంపై మరొకరి పెత్తనం చెల్లదనే ఒక నాయకుడిగా .. వీరుడిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనీ, ‘దేవర’ అనేది తండ్రి ఎన్టీఆర్ పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. మిక్కిలినేని సుధాకర్ – కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లకు రానుంది.