కొత్త సంవత్సరం రోజున హైదరాబాద్ నగర వాసులకు మరొక కీలకమైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బొటానికల్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ లను కలిపే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను రేపు మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నారు. 263 కోట్ల రూపాయల నిర్మాణంతో చేపట్టిన 2.21 కిలోమీటర్ల ఫ్లైఓవర్ భాగం, మరో 784 మీటర్ల ర్యాంపులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నవి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉన్న ఈ ఫ్లైఓవర్ ఎస్ఎల్ఎన్ టెర్మినస్, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో తరచుగా పోగయ్యే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలు కలుగుతుంది.
మజీద్ బండ రోడ్డు నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 401మీటర్ల ర్యాంపు, కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వైపు 383 మీటర్ల ర్యాంపు నిర్మాణం జరిగింది. కొత్తగూడ జంక్షన్ వద్ద మూడు లైన్లతో నిర్మిస్తున్న అండర్పాస్ 470 మీటర్ల పొడవున ఉన్నది. దీంతో హఫీజ్ పేట్ నుంచి గచ్చిబౌలి వెళ్లే ట్రాఫిక్ సునాయాసంగా ముందుకు కదులుతుంది. ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో రావడంతో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ వద్ద 100% ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీంతోపాటు కొండాపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ దాదాపుగా 70% తగ్గే అవకాశం ఉన్నది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వరకు విస్తరించి ఉన్న అనేక ఐటి మరియు ఇతర సంస్థలలోని ఉద్యోగులకు, నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగే అవకాశం ఏర్పడుతుంది.
రేపు 12 గంటలకి ఈ ప్రాజెక్టుని మంత్రి కేటీఆర్ బొటానికల్ గార్డెన్ వద్ద ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన srdp ప్రాజెక్ట్ ద్వారా 34 ప్రాజెక్టులు పూర్తి కాగా మరో 14 ప్రాజెక్టుల వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.