హైదరాబాద్ లో ప్రయాణం సాఫీగా సాగాలంటే వాహనం ఉంటే సరిపోదు…సరైన రోడ్డు మార్గం ఉండాలి. ఇదే స్ఫూర్తితో జిహెచ్ఎంసి పరిధిలో నివాసితులకు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ ఓ బి లను వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి (SRDP) పథకం చేపట్టడం మూలంగా చక్కటి రోడ్డు మార్గం ఏర్పడింది.
పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కృషి చాలా ఉందని చెప్పవచ్చు. సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థకు చేపట్టిన ఎస్.ఆర్.డి.పి పథకాలు ఒక్కొక్కటి ప్రజలకు అందుబాటులోకి రావడంతో చేరవలసిన గమ్యస్థానానికి సకాలంలో సురక్షితంగా చేరడం జరుగుతుంది.
ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం 41 పనులను చేపట్టగా అందులో 30 పనులు పూర్తి అయ్యాయి. ఇతర శాఖలకు సంబంధించిన 6 పనులలో 3 పనులు అందుబాటులోకి రాగ చేపట్టిన మొత్తం పనులలో 33 పూర్తయ్యాయి. అందులో 17 ఫ్లైఓవర్ లు అందుబాటులోకి రావడం జరిగింది. మిగతా పనులు అండర్ పాసులు, ఆర్ ఓ బిలు ఇతర రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. గచ్చిబౌలి ప్రాంతంలో చేపట్టిన కొత్తగూడ ఫ్లై ఓవర్ నగరంలో 18వ ఫ్లై ఓవర్, ఈ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నది.
గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ. 263 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 కిలో మీటర్ల పొడవు గల కొత్తగూడ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నది. 3 కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ఫ్లై ఓవర్ 470 మీటర్ల పొడవు తో 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ ను కూడా చేపట్టి పూర్తి చేశారు. ఇందులో 65 మీటర్ల పొడవుతో క్లోజ్డ్ బాక్స్ 425 మీటర్ల ఓపెన్ బాక్స్ గల అండర్ పాస్ చేపట్టారు. కొత్త గూడ ఫ్లైఓవర్ ను, నగర ప్రజలకు కొత్త సంవత్సరం కానుకగా జనవరి 2023, మొదటి వారంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
కొత్తగూడ ఫ్లైఓవర్ వలన వాహనదారులు, దాని చుట్టూ ఉన్న కాలనీ లు, పరిసరాల వారికి ఈ బ్రిడ్జి వలన మౌలిక ప్రయోజనం పొందుతారు. అందులో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుండి సాఫిగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. దానికి తోడ ప్రస్తుతం ఉన్న గ్రేడ్ కారిడార్ కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ జంక్షన్ ల పరిసరాల్లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీ లు ఉండడం వలన రద్దీ సమయంలో ట్రాఫిక్ సమస్య ఉండదు.
గచ్చిబౌలి నుండి మియాపూర్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీ తో పాటు మియాపూర్, హై టెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలను కలుపుతుంది. ఫ్లై ఓవర్ వలన బొటానికల్ గార్డెన్ జంక్షన్ కొత్తగూడ జంక్షన్ లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవడమే కాకుండా కొండాపూర్ జంక్షన్ లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.
Also Read : హైదరాబాద్ లో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం : మేయర్