తెలంగాణలో కొవిడ్ పేషెంట్లు క్రమంగా పెరుగుతున్నారు. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరిగింది. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి అధికంగా పేషెంట్లు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 3,959 మంది పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్నారు.
పెరుగుతున్న కరోనా పేషెంట్లు..
కరోనా చికిత్సలు పొందుతున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్ నిబంధనలు ప్రజలు గాలికి వదిలేయడం, వాతావరణంలో మార్పులు రావడంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్నామని ధీమాతో మాస్కులు ధరించకపోవడం, శానిటైజర్లు వాడకపోవడంతో వైరస్ క్రమంగా ప్రబలుతోందని సమాచారం. సాధారణ జ్వరం అనుకొని నిర్లక్ష్యం చేసిన వారికి పరిస్థితి విషమంగా మారుతుంది. మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు.ప్రస్తుతం పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్‌కు ప్రారంభంగా వైద్యులు భావిస్తున్నారు. పేషెంట్లలో వెలుగులోకి వస్తున్న కొత్త లక్షణాలను నమోదు చేస్తున్నారు.
చికిత్సలు పొందుతున్న 3959 మంది..
ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో శుక్రవారం 10,028 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 3,959 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. గత వారం రోజులుగా 3000 నుంచి 4500 వరకు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలు పొందుతున్న వారి సంఖ్య నమోదువుతుంది. రోజురోజుకూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకంగా కొవిడ్ చికిత్సలు అందిస్తున్న గాంధీ ఆసుపత్రిలోనే 401 మంది కరోనా పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. గాంధీలో రోజుకు 40 నుంచి 50 మంది వరకు డిశ్చార్జ్ అవుతుండగా 30 నుంచి 40 మంది వరకు కొత్తగా పేషెంట్లు చేరుతున్నారు.
జిల్లాలో అధికంగా నమోదువుతున్న కేసులు..
ప్రస్తుతం నమోదువుతున్న కేసుల్లో ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లా నుంచి అధికంగా ఉంటున్నాయి. వీటితో పాటు రాష్ట్రానికి సరిహద్దులుగా ఉండే 11 ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది. వాస్తవానికి చికిత్సలు పొందుతున్న పేషెంట్ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికి ప్రభుత్వం అధికారిక లెక్కలలో తక్కువగా చేసి చూపిస్తుంది. హైదారాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు వందల సంఖ్యలో కొవిడ్ పేషెంట్లు చేరుతున్నప్పటికీ కేవలం పదుల సంఖ్యలో చికిత్సలు పొందుతున్నట్టుగా అధికారిక లెక్కల్లో చూపెడుతున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 400 మందికి పైగా చేరుతున్నారు..
కొవిడ్ పేషెంట్లు రోజుకు 400 మందికి పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కోరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. థర్డ్‌వేవ్ ప్రారంభమైందనే అనుమానాలు కలుగుతున్నాయి. అధికారిక లెక్కల్లో కేసుల సంఖ్య తక్కువగా చూపెడుతూ పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రజలు అప్రమత్తమయ్యేలా ముందుస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.ప్రభుత్వ నిర్లక్ష్యంతో సెకండ్ వేవ్‌లో తలెత్తిన భయంకరమైన పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. సర్కారు దవాఖానాలపై ప్రజలకు భరోసా లేకపోవడం వలన ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ కొనసాగుతున్న ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.