సీతాదేవిగా కృతి సనన్ నిరూపించుకోవలసిందే!ఆదిపురుష్’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ అభిమానులతో పాటు, భక్తిరసాన్ని ఇష్టపడేవారంతా కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇది రామాయణ కథాకావ్యమే ప్రధానమైన ఇతివృత్తంగా నిర్మితమైన సినిమా. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో థియేటర్స్ దాహం తీర్చే ఈ స్థాయి సినిమా రాలేదు. ముఖ్యంగా పౌరాణిక నేపథ్యంలో రాలేదు. విజువల్స్ పరంగా మంచి మార్కులు కొట్టేయడం వలన, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ సినిమా చూడటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ను చాలామంది అంగీకరించారు. ఆయన హైటూ .. పర్సనాలిటీ .. పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఆయనను రాముడిగా చూడటానికి ఇష్టపడుతున్నారు. కానీ సీతాదేవి పాత్రలో కృతి సనన్ ఎంపిక సరైనది కాదనే అభిప్రాయాలు, ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నప్పటి నుంచి వినిపిస్తూనే వున్నాయి.
సీతాదేవి పాత్రలో మెప్పించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. చంద్రబింబం మాదిరిగా గుండ్రని ముఖ వర్చస్సు ఉన్నవారే ఈ పాత్రకి సరిపోతారని పాత సినిమాలు చెప్పాయి. అంజలీదేవి .. జయప్రద వంటివారు అందుకు నిదర్శనంగా నిలిచారు కూడా. ‘శ్రీరామరాజ్యం’లో సీతాదేవిగా నయనతార ఎంపికను చాలామంది ఒప్పుకోలేదు. అందుకు గల కారణాలలో ఒకటి ఆమెది కోల ముఖం కావడమే. కృతి సనన్ విషయంలో చాలామంది అసంతృప్తికి కారణం కూడా ఇదే. తన నటనతో ఈ విమర్శలకు ఆమె రేపు సమాధానం చెబుతుందేమో చూడాలి మరి.