తెలంగాణ యువతకు అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండాలన్న సంకల్పం ఎప్పటిలాగే సాకారం అయింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మార్గదర్శనం, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు నాయకత్వ ప్రతిభ-చొరవ, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిరంతర సమన్వయం, అలుపెరగని కృషితో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశాల్లో తెలంగాణ పేరు మారుమోగింది.
తెలంగాణ సాధించిన పెట్టుబడులు-విజయాలు:-
2 వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్ ను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్న భారతీ ఏయిర్ టెల్ గ్రూప్
హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్ లో విస్తరిస్తామని ఫ్రాన్స్ కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ ప్రకటన
లండన్ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న అపోలో టైర్స్
210 కోట్ల రూపాయల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం.
తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించిన పెప్సికో
నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాదులో ప్రారంభించనున్న ప్రపంచ ఆర్థిక వేదిక.
రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్ పీటీ, 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్
నాలుగు రోజుల్లో అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీ అగ్రనాయకత్వాలతో 52 సమావేశాలు.. ఆరు రౌండ్ టేబుల్ మీటింగ్స్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక వేత్తలతో 2 చర్చా గోష్టులు మొత్తంగా 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ఈసారి తెలంగాణ గెలుచుకున్న పెట్టుబడుల లెక్కలివి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ఈసారి కూడా దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల వ్యాపార వాణిజ్య సంస్థలు నాయకత్వం, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగం పంచుకునే మేధావులు, ఆర్థిక నిపుణులు ఎంతో మంది తెలంగాణ పెవిలియన్ ను సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపంతో పాటు ఎనిమిది సంవత్సరాల్లో వివిధ రంగాల్లో సాధించిన పెట్టుబడులు, పారిశ్రామిక, ఐటి దాని అనుబంధ రంగాల్లో చేపట్టిన టీ హబ్, టీ వర్క్స్ కార్యక్రమాల సమాచారాన్ని ఆసక్తిగా తెలుసుకున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టు, ఇతర మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను చూశారు.
దావోస్ లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే పెట్టబడుల వేట మొదలుపెట్టిన తెలంగాణ టీం అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఐదోసారి వరల్డ్ ఎకానమీ ఫోరం సమావేశాలకు హాజరైన మంత్రి కేటీఆర్ ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతం అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అగ్రనాయకత్వంతో ఓవైపు ముఖాముఖి చర్చలు నిర్వహిస్తూనే, మరోవైపు ప్రఖ్యాత ఆర్థిక సంస్థల సమావేశాలకు హాజరై తెలంగాణ విజయగాథను వివరిస్తూ కేటీఆర్ బీజీబిజీగా గడిపారు. ఏ దేశం వెళ్లినా అక్కడి తెలంగాణ ఎన్నారైలను ఆత్మీయంగా కలుసుకునే కేటీఆర్, ఈసారి కూడా స్విట్జర్లాండ్ జూరిక్ లో ఉంటున్న మన మట్టి బిడ్డలతో సమావేశమై తెలంగాణ ప్రగతిని వివరించారు.
అద్భుతమైన పారిశ్రామిక విధానాలతో పాటు మౌలిక వసతులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపైన పరిచయం చేసేందుకు వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశాలు సరైనవని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కేంద్రంగా వివిధ దేశాల వ్యాపార, వాణిజ్య సంస్థలతో తన సంబంధాలను తెలంగాణ బలోపేతం చేసుకుంటూ వస్తున్నదన్నారు. ఈసారి సమావేశాల్లోనూ తమ ఈ లక్ష్యం విజయవంతం అయిందన్నారు. నాలుగు రోజుల ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దాదాపు 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయన్న కేటీఆర్, భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించి వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తున్నదని కేటీఆర్ చెప్పారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల ఏర్పాట్ల నుంచి మొదలుకొని విజయవంతంగా పర్యటన ముగిసేదాకా శ్రమించిన పరిశ్రమల, ఐటీ ,ఇతర శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యంగా తన పర్యటనలో భాగంగా ఉన్న బృందానికి ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు.