Friday, March 29, 2024
HomeTrending Newsశాఫ్రాన్ నిర్ణయం ఇతర కంపెనీలకు స్ఫూర్తి: కేటిఆర్

శాఫ్రాన్ నిర్ణయం ఇతర కంపెనీలకు స్ఫూర్తి: కేటిఆర్

SAFRAN MRO:  పెట్టుబ‌డిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడ‌ర్లని ముఖ్యమంత్రి కేసీఆర్  ఎప్పుడూ అంటుంటార‌ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన సింగల్ విండో విధానం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో దాదాపు రూ. 1200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఓ ఫెసిలిటీని పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు శాఫ్రాన్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని, ఓ ప్రపంచ స్థాయి సంస్థ భార‌త్‌లో ఏర్పాటు చేసే మొద‌టి ఇంజిన్ ఎంఆర్ఓ కూడా ఇదేనని వెల్లడించారు. బెంగుళూరు, చెన్నైలో ఏర్పాటు చేయ తలపెట్టిన రెండో సెంటర్ ను కూడా ఇక్కడే ఏర్పాటుచేయాలని,  దానికి అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. దాదాపు 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పుతోన్న ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్  ద్వారా షుమారు వెయ్యి మంది దాకా ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు.  శాఫ్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన పెద్ద కంపెనీలకు ఓ స్పూర్తిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐటి రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం కోసం టీ హ‌బ్ ఏర్పాటు చేశామని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటి హబ్-2 ను ఇటీవలే ప్రారంభించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాఫ్రాన్ సీఈవో ఒలివీయే అంద్రియస్, శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో జోపాల్ అల్లరీ, రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్