Sunday, January 19, 2025
HomeTrending Newsవైజాగ్ ఉక్కు- తెలుగు ప్రజల హక్కు: కేటిఆర్

వైజాగ్ ఉక్కు- తెలుగు ప్రజల హక్కు: కేటిఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, దీన్ని కూడా కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటిఆర్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని లేఖలో కేటీఆర్ ప్రశ్నించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు  అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని సూచించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు.  ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కొన్ని స్వార్థపూరిత శక్తులు, వారి ఎజెండాలకు బలి కావొద్దని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోమని మంత్రి కుండబద్దలు కొట్టారు. కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే  కేంద్రం కుట్రలు ఆగదని, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను భారీ ఎత్తున తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, బిఎస్ఎన్ఎల్, సింగరేణి వంటి ఇతర పబ్లిక్ సెక్టార్ రంగ సంస్థలు కూడా అంతిమంగా ప్రవేట్ కంపెనీల చేతులలోకి పోయేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనాన్ని పరిశీలించాలని కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40% లోపలనే ఉన్నదని చెప్పారు. పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో..  వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో  ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, మార్కెట్ లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు.

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంటుందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లేపిన ఈ సరికొత్త కుట్రను ఎదుర్కొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కు  కేటీఆర్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్