Saturday, January 18, 2025
Homeసినిమాబాల్యంలోకి తీసుకుని వెళ్లే 'కురంగు పెడల్'

బాల్యంలోకి తీసుకుని వెళ్లే ‘కురంగు పెడల్’

ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలుగుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ .. వేలకోట్ల బిజినెస్ అనేది కామన్ గా మారిపోయింది. భారీ రేటు పెట్టి టిక్కెట్ కొనుక్కుని వెళ్లిన ప్రేక్షకుడు సంతృప్తి చెందుతున్నాడా అంటే అదీ లేదు. సినిమా ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని అందించడమే .. వీలైతే సందేశాన్ని కూడా జోడిస్తే మరీ మంచిదీ. నిజానికి సరైన కంటెంట్ ఉన్న సినిమాలకి ఖర్చుతో పనిలేదనేదే చాలామంది అభిప్రాయం.

ఈ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తెలుగులోనూ దూసుకొచ్చిన తమిళ సినిమానే ‘కురంగు పెడల్’. 1980ల్లో విలేజ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఆ ఊరికి దూరంగా ఒక పెద్ద కొండ ఉంటుంది .. ఆ కొండపై ఒక దేవాలయం ఉంటుంది. ఆకాశాన్ని కొలవడానికి తాపత్రయ పడుతున్నట్టుగా అనిపించే ఆ కొండను చేరుకోవాలంటే నదిపై ఉన్న ఒక బ్రిడ్జ్ దాటాలి. అక్కడికి వెళ్లాలంటే సైకిల్ కావాలి .. అందుకు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి. ఇదీ 12 ఏళ్ల వయసున్న ఓ నలుగురు పిల్లల ఆలోచన.

అప్పట్లో గ్రామాల్లో .. అందునా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో సొంత సైకిల్ ఉండటమే గొప్ప విషయం. సైకిల్ ఉన్నప్పటికీ పిల్లలకి ఇచ్చేవారు కాదు. అద్దెకి తీసుకునేంత డబ్బు అప్పటి పిల్లల దగ్గర ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో తమ కలను ఆ పిల్లలు ఎలా నిజం చేసుకున్నారనేది కథ. భారీ మలుపులు .. భయంకరమైన ట్విస్టులు ఏమీ ఉండవు. చాలా సున్నితమైన అంశాలతో కూడిన సినిమా ఇది. చూస్తున్నంత సేపు, ఆ రోజులు .. ఆ బాల్యం .. ఆ జ్ఞాపకాలు ..  అనుభూతులు కలదనీయకుండా చేస్తాయంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్