తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్. రమణ రేపు (జూలై 12, సోమవారం) తెలంగాణా రాష్ట్ర సమితిలో అధికారికంగా చేరనున్నారు. తెలంగాణాభవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటియార్ రమణను పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వం ఇవ్వనున్నారు. ఈ నెల 16న ఓ సభ ఏర్పాటు చేసి తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లో చేరనున్నారు.
౩౦ ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రమణ, రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణా లో తెలుగుదేశం తన పట్టు పూర్తిగా కోల్పోయి నామమాత్రంగానే మిగిలింది. ఈ నేపథ్యంలో రమణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అధికార టి.ఆర్.ఎస్.లో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం అయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సిఎం కెసియార్ తో సమావేశమయ్యారు. అనంతరం టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రమణ చేరిక హుజురాబాద్ లో తమకు మరింత మేలు చేస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.