రాజధానిపై ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీ నారాయణ సూచించారు. రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు తమ భూములకు విలువ గురించి పోరాటం చేయడం లేదని, రాష్ట్రానికి రాజధాని కోసం దీక్షలు చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 1 వ తేదీ నుంచి ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ అనే నినాదంతో హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకూ చేపట్టిన అమరావతి రైతులు మహా పాదయాత్రకు లక్ష్మీనారాయణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో అయన విలేకరులతో మాట్లాడారు. రైతు మహా పాదయాత్రలో తాను కూడా వీలున్న చోట భాగస్వామిని అవుతానని వెల్లడించారు. అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు 681 రోజులుగా దీక్షలు చేస్తున్నారని, వారి ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. రాజధాని అభివృద్ధి చెందితేనే పెట్టుబడులు వస్తాయన్నారు. అమరావతిలో షుమారు 10 వేల కోట్ల రుపాయలతో పనులు చేశారని, మరో 43 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు కూడా పిలిచారని, కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రాజదానికోసం ఇచ్చిందని అయన గుర్తు చేశారు. రాజధాని కోసం రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారని చెప్పారు.
రాజధాని ఆందోళనలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, మహిళలు ఉద్యమ బాటలో నడవడం, వారిని రోజుల తరబడి దీక్షా శిబిరాల్లో కూర్చో బెట్టడం సమంజసం కాదని అయన అభిప్రాయపడ్డారు. మన సంస్కృతిలో మహిళలకు ఎంతో గౌరవం ఉందని, సమున్నత స్థానం ఇచ్చామన్నారు. మహిళలపై అణచివేతలు, బలప్రయోగాలు చూసి హృదయం కలచి వేస్తోందని అయన వ్యాఖ్యానించారు. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా చెప్పయని పేర్కొన్నారు. ఇక్కడ నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి మొదలు పెడితే అందరూ ఆనందంగా ఉంటారని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అయన వివరించారు.