Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంటాల్కంతో పళ్లు తోమిన రుధిరం

టాల్కంతో పళ్లు తోమిన రుధిరం

శ్రీశ్రీ ఒక పెద్ద బాలశిక్ష.
శ్రీశ్రీ ఒక రామాయణం.
శ్రీశ్రీ ఒక బైబిల్.
శ్రీశ్రీ ఒక ఖురాన్.
నా జనరేషన్ జర్నలిస్టులకు శ్రీశ్రీ సర్వస్వం.
శీర్షిక పెట్టాలన్నా శ్రీశ్రీ.
లీడ్ రాయాలన్నా శ్రీశ్రీ.
ఫీచర్ మొదలు పెట్టడానికి శ్రీశ్రీ.
ముక్తాయింపుగా శ్రీశ్రీ.
శ్రీశ్రీని చదివిన జర్నలిస్టులు కొందరు.
శ్రీశ్రీని చదివిన సీనియర్లను చదివిన కుర్ర జర్నలిస్టులు కొందరు.
మొత్తం మీద ఏదో ఒకటి చదివిన తరం అది..
తరం మారిందని చెప్పడం కొంచెం బాధే
పాతతరం వాడినై పోవడం కొంత చింతే..

కానీ,
ఏదీ చదవక్కర్లేదు.
ఏదీ తెలుసుకోనక్కర్లేదు.
ఏ దిల్ మాంగే నోర్..
అని నోరేసుకుని పడిపోయే తరాన్ని చూడడం ఇంకా భాదే.
(ఇప్పుడు బాధని ఇలాగే అంటున్నారు.)

వంకర్లు తిరిగే యాంకర్లు
అరిగిపోయేలా రాసే “సబ్బు”లు.
వార్తలు మోసుకొచ్చే రి”పోర్టర్”లు.
బాగా సంపాదించే సంపాదకులు.
చివరికి ఛీయివోలు
అందరిదీ  ఇదే దారి.

అక్షరం  చదవక్కర్లేదు
జ్ఞానంతో పని లేదు.
మెడకో మైకు, కళ్ళ ముందు కెమెరా
ఈ రెండూ వుంటే  చాలు..
వినేవాళ్ల ఖర్మ..
ప్రేక్షకుల ప్రాప్తం.

“రాసిందేదో రాస్తాం
తీసుకొనుము తోచినంత తీపో చేదో”
అని శ్రీశ్రీ అన్నట్టే.

వాగేదేదో వాగుతాం…
తీసుకొనుము తోచినంత
అంటోంది ఇవాళ్టి మీడియా…

అంబరాన్ని రుధిరం అనుకునేంత అమాకత్వం.
టాల్కమ్ పౌడర్ తో పళ్ళు తోముకునేంత పసితనం.
వరుణుకి భానుడికి తేడా తెలియని లేతమెదళ్ళు..
ఇదేంటంటే మళ్ళీ దబాయింపు
మీరు మాలాగా అనర్గళంగా మాట్లాడగలరా?
స్క్రిప్టు రాయగలరా?
ఏవిటో ఈ వితండ వాదం?

“ఈరోజులలో ఎవడికి
నోరుంటే వాడే రాజు, నూరుచు మిరియా
కారాలు, తెగబుకాయి
స్తే రాజ్యాలేలవచ్చు”
అని శ్రీశ్రీ అప్పుడే చెప్పాడు.

ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల నుంచి.,
అణగారిన వర్గాల నుంచి
ఎన్నికైన ఎమ్మెల్యేలకు పదవీప్రమాణంలో తప్పులు దొర్లితే, వేసిందే వేసి, వేళాకోళం చేయొచ్చు.
ప్రపంచ జ్ఞానులమని చెప్పుకునే ప్రెజెంటర్లకు ప్రాథమిక అవగాహన కరువైతే తప్పు పట్టకూడదా?
దేశదేశాల అధినేతల మాటల్లో చేతల్లో తప్పుల్ని ఎండగట్టొచ్చు..
ఛానళ్లను ఒంటిచేత్తో నడుపుతున్నామని చెప్పుకునేవాళ్ళ అజ్ఞానం గురించి మాట్లాడకూడదా?
పైగా ఇది తప్పన్న వాడి అర్హతను ప్రశ్నిస్తారు.
నువ్వు తప్పుల్లేకుండా రాయగలవా?
నువ్వు తప్పుల్లేకుండా మాట్లాడగలవా? అని ఎదిరిస్తారు.

“పందిని చంపిన వాడే కందం రాయాల”న్నట్టుందిది.
ఎన్నికల్లో పోటీ చేసి,  గెలిచి, ప్రధాన మంత్రి పదవిలో పనిచేశాక  మనం ప్రధానిని విమర్శిస్తామా?
కథలు రాసి, డైరెక్షన్ నేర్చుకుని సినిమా తీసాక, సినిమాలను రివ్యూ చేస్తామా?
వంట రుచి  చూడడానికి వండడం రావాలా?

“పెదబాలశిక్ష చదివీ
చదవడమే తడవుగాగ సాహిత్య విశా
రదలయినట్లుగ భావిం
చెదరు గదా కొంత మంది”
అని శ్రీశ్రీ అప్పటి రచయితల గురించి బాధపడ్డాడు.

ఇప్పుడు ఆ పెదబాల శిక్ష కూడా చదవకుండానే
పేరుమోసిన ప్రెజెంటర్లమని  భావిస్తున్నారు.. అనేక మంది..

“నేల మునగ చెట్టెక్కగ
నిచ్చెన వేస్తావటగా
శ్రీశ్రీనే ఎదిరించగ
ఎత్తుకి పెరిగావటరా..”

అని మేరుపర్వతం లాంటి శ్రీశ్రీ ఉక్రోష పడిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు.

కానీ, ఈ మరుగుజ్జు మెదళ్లకు అంత పౌరుషం అవసరంలేదు.
“రచయితన్నవాడు చచ్చేంత చదవాలి
చచ్చే వరకు చదవాలి” అంటారు

రాసేవాళ్లే కాదు..  కూసేవాళ్ళు కూడా చదవాలి.
భాష మీదా.. భావం మీదా పట్టు వుండి తీరాలి.
విషయం,  విజ్ఞానం కొంతైనా వంటపట్టాలి.
నోటికొచ్చిన ప్రశ్నలేసి ఎన్ కౌంటర్ చేసేయడం;
ఇద్దరి మధ్య పచ్చగడ్డి  రాజేసి పబ్బం గడిపేసుకోవడం…
ఇవన్నీ పాతబడిన విద్యలైపోయాయి.
ఇది సోషల్ మీడియా కాలం.
ఇక్కడ ప్రతిక్షణం పరీక్షాసమయమే.
తప్పు జరిగితే ట్రోల్ తీస్తారు..
మా చానెల్ మా ఇష్టమంటే కుదరదు.

“వ్యక్తుల ప్రైవేటు బతుకు
వారివారి సొంతం
పబ్లికులో నిలబడితే
ఏమైనా అంటాం”

-శైలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్