సిఎం జగన్ ప్రతి పేదవాడి గుండెలో ఆత్మబంధువుగా ఉన్నారని, అన్ని కులాలను దగ్గరకు తీసుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. మాటిస్తే తప్పని నాయకుడు జగన్ అయితే, ఇచ్చిన మాట మీద ఏనాడు నిలబడని సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సిఎం జగన్ గుండెల్లో పెట్టుకున్న చూసుకుంటున్నారని, కానీ ఈ వర్గాలను వాడుకుని, తర్వాత అవమానించి, చులకనగా చూడటం చంద్రబాబు నీచరాజకీయని దుయ్యబట్టారు.
నంద్యాలలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు వేలాది జనం తరలివచ్చారు. ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామిలు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, హఫీజ్‌ఖాన్‌లు ప్రసంగించారు.
నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబును నమ్మితే..మనల్ని మనం మోసం చేసుకోవడం… మన సంక్షేమం, అభివృద్ధికి చేటు చేసుకోవడమేనని ప్రజలకు హితవు పలికారు. జగనన్న కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలన్నీ కలిసి నిలబడాలని, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని, అప్పుడే మన జీవితాల్లో వెలుగులు ఉంటాయని విజ్ఞప్తి చేశారు.
నర్సీపట్నంలో
చంద్రబాబు తరహాలో ఏరు దాటాక తెప్ప తగేలయకుండా, ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి జరగలన్నా, జగన్ అన్న సంక్షేమం కొనసాగాలంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం.. ఉత్తేజంతో ఉరకలేస్తూ సాగింది. నర్సీపట్నం మెయిన్ రోడ్డులో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ప్రభుత్వ విప్-చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి,పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్ లు హాజరయ్యారు.
ముత్యాల నాయుడు మాట్లాడుతూ… అయ్యనపాత్రుడు ఇంటికి వెళ్లాలంటే మూడు గేట్లు దాటి వెళ్లాలని, కానీ ఉమా గణేష్ ఎక్కడుంటే అక్కడకి నేరుగా ఎవరైనా వెళ్లవచ్చునని వివరించారు. నర్సీపట్నం శాసనసభ్యుడుగా మరోసారి గణేశ్ ను గెలిపిస్తే, సీఎం జగన్ ఈసారి ఆయనకు ఎంతటి ఉన్నత స్థానం కల్పిస్తారో అంతా చూడవచ్చునన్నారు.