Friday, November 22, 2024
HomeTrending Newsఅంతర్యుద్దం అంచున ఆఫ్ఘనిస్తాన్

అంతర్యుద్దం అంచున ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ మనుగడ ప్రమాదపు అంచున ఉందని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నాటో, అమెరికా దళాల ఉపసంహరణ తేదీ ప్రకటించిన నాటి నుంచి తాలిబాన్ బలం పెరుగుతోంది. కాబూల్ లో జరిగిన జాతీయ సయోధ్య మండలి ఉన్నత స్థాయి సమావేశంలో ఆఫ్ఘన్ భవిష్యత్ పై నేతలు భయాందోళనలు వెలిబుచ్చారు. తాలిబాన్ విధానాలతో ఆఫ్ఘన్ ప్రభుత్వం బలవంతపు యుద్ధం వైపు వెళ్ళాల్సి వస్తోందని సయోధ్య మండలి చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

మండలి సమావేశంలో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని పాల్గొన్నారు. శాంతి చర్చలపై పట్టనట్టు వ్యవహరిస్తున్న తాలిబాన్ నాయకత్వం  ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రభుత్వ యంత్రాంగంపై దాడులను ప్రోత్సహిస్తోందని అబ్దుల్లా ఆరోపించారు. దోహలో రెండు వర్గాల మధ్య చర్చలు సఫలం అవుతాయన్న విశ్వాసం సన్నగిల్లుతోందని విచారం వ్యక్తం చేశారు. తాలిబాన్-ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య నెలల తరబడి జరుగుతున్న శాంతి చర్చలు ప్రహాసనంగా మారుతున్నాయన్నారు.

తాలిబాన్ తీరుపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయన్న అబ్దుల్లా అబ్దుల్లా ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్దం వైపు పయనిస్తోందని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు ఆయుధాలు చేపట్టి తాలిబాన్ ఉగ్రవాదులపై తిరగబడే ప్రమాదం ఉందని సైనివర్గాలు అంటున్నాయి. మరోవైపు నాటో బలగాలకు సాయంగా వివిధ హోదాల్లో పనిచేసిన అఫ్ఘన్లను సురక్షిత ప్రాంతాలకు, ఇతర దేశాలకు అమెరికా పంపిస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తాలిబాన్ మూకలు ఇప్పటికే పూర్తి స్థాయిలో పట్టు సాధించాయని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్