Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Wonders of Sculpture:  కన్న తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్ప అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అన్నాడు. అలా నాకు స్వర్గం కంటే గొప్ప లేపాక్షి. పాతికేళ్లపాటు ఆ గుడిలో, గుడి చుట్టూ తిరుగుతూ పెరిగినా…గుడిలో చూడాల్సింది, గుడి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉన్నట్లు వెళ్లిన ప్రతిసారీ అనిపిస్తూ ఉంటుంది.

Lepakshi Temple

హిందూపురం వెళ్లిన ప్రతి సందర్భంలో లేపాక్షికి వెళ్లిరావడం నాకొక పులకింత. అలా ఈమధ్య ఒక పనిమీద హిందూపురం వెళ్లి…మరుసటి రోజు పొద్దున్నే లేపాక్షికి వెళ్లాను. గతంలో గుడి గురించి ప్రస్తావించిన విషయాలను వదిలేసి ఈసారి మరి కొన్ని ప్రత్యేకతలమీద దృష్టి సారిద్దాం.

విరుపణ్ణ రక్తాశ్రువులు:

విజయనగర రాజుల కాలంలో అచ్యుతరాయల దగ్గర పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా పనిచేసిన విరుపణ్ణ ఇంటిదేవుడు వీరభద్ర స్వామి. పేరుకు వీరభద్రుడు ఎదురుగా ప్రధాన గర్భాలయంలో కొలువై ఉన్నా…వీరభద్రుడి చుట్టూ అంతే ప్రాధాన్యంతో శివుడు, పార్వతి, విష్ణువు, దుర్గ…మిగతా దేవతలు కూడా ఉన్నారు. శివుడు వీరభద్రుడిగా మారి దక్షుడి తల నరికిన తరువాత స్వయంభువుగా వెలిసిన ప్రాంతమిది.

అగస్త్యమహాముని శివుడిని ఇక్కడ పాపనాశేశ్వరుడిగా దర్శించి, కొలిచాడు.
అంటే విరుపణ్ణ గుడి కట్టించడానికి ముందే ఈ కొండ మీద వీరభద్రుడికి పూజలు జరుగుతూ ఉండేవి. నిలువెత్తు వీరభద్రుడి విగ్రహం పక్కన చిన్న స్వయంభువు విగ్రహం ఇప్పటికీ ఉంది.

దాదాపు ఆలయ నిర్మాణం పూర్తయ్యే దశలో…పెనుకొండ సంస్థానం కోశాధికారి హోదాలో సంస్థానం సొమ్మును గుడికి మళ్లించి…నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని రాయలకు ఫిర్యాదులు వెళ్లాయి. అవునా? అయితే…విరుపణ్ణ కళ్లు పీకేయండి అని రాయలు ఆదేశించాడు. విషయం తెలిసిన విరుపణ్ణ కుమిలిపోయాడు. చేయని తప్పుకు శిక్ష పడిందన్న బాధతో…వైరాగ్యంతో తన కళ్లను తానే పెకలించుకుని శివపార్వతుల కల్యాణ మండపం నిర్మాణమవుతున్న గోడకు విసిరికొట్టి…కళ్లులేనివాడిగా లేపాక్షికి దగ్గర్లో ఏదో ఊరి దగ్గర తనువు చాలించాడు. ఆ గోడ మీద ఇప్పటికీ రెండు రక్త చారికలు అలానే ఉన్నాయి.

అవి రక్త చారికలే అని ఒక బ్రిటీషు అధికారి శాస్త్రీయంగా తేల్చారని, ఆ విషయాన్ని అధికారికంగా రికార్డు కూడా చేశారని కొందరంటారు. 500 ఏళ్లపాటు రక్తం మరకలు అలాగే ఉన్నాయన్న వాదననే స్థానికులతో పాటు చాలామంది నమ్ముతున్నారు. కళ్లు పోయాయి కాబట్టి లోప అక్షి…లోపాక్షి…లేపాక్షి అయ్యిందని ఈ కథనంతో ముడిపడిన సమర్థన కూడా అనాదిగా ఉంది.

ఆలయం మధ్యలో శివపార్వతుల కళ్యాణ మండపం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ గోడ మీద చారికలను చూస్తున్న ప్రతిసారీ గుండెలో ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. విరుపణ్ణ తనను తానే శిక్షించుకుని, కళ్లు లేక, దిక్కులేని చావు చచ్చాడని వినడానికి, అంగీకరించడానికి చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నా మనసు ఒప్పుకోదు. తప్పు చేస్తే సొంత మామ దక్షుడినే శిక్షించిన వీరభద్రుడిని కొలిచిన విరుపణ్ణను వీరభద్రుడు రక్షించే ఉంటాడని…అచ్యుతరాయల కాలం ముగింపు వేళ…విజయనగర రాజ్య పతన వేళ…ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా అలా…ఆగిపోయి ఉంటుందన్నది నా ఊహ. నా ఊహ నిజం కావాలని కోరుకుంటూనే ఉన్నాను కానీ…కథలో రక్తాశ్రువులు మాత్రం అయిదు శతాబ్దాలుగా కంటికి మంటికి ఏకధారగా కురుస్తూనే ఉన్నాయి.

లేపాక్షి లతలు:-

Lepakshi Temple

శివుడు స్థాణువు. కదలని శక్తి. పార్వతి ప్రకృతి. కదిలే లేదా కదిలించే శక్తి. మన భాషలో శివుడు స్టాటిక్ పవర్. పార్వతి కైనెటిక్ పవర్. వారి కళ్యాణానికి లేపాక్షి గుడి మూడో ప్రాకారంలో విరుపణ్ణ కట్టదలుచుకున్న మండపం పూర్తయి ఉంటే…అది మరో అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయి ఉండేది. మండపంలోకి సప్తర్షులు వచ్చారు. అష్టదిక్పాలకులు వచ్చారు. పురోహితుడిగా బ్రహ్మ సిద్ధంగా ఉన్నాడు. కొత్త పెళ్లికూతురయిన అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి పట్టు వస్త్రాలు సిద్ధం. సాధారణంగా మనమయితే బంగారు పళ్లెంలో పసుపు కుంకుమ, ఆకు వక్క, చీర రవికె పెడతాం. ఈ కళ్యాణ మండపంలో రాతి స్తంభాలకు ప్రకృతి పట్టు చీరలను అద్ది విరుపణ్ణ ఇచ్చిన రకరకాల డిజైన్లు శిలాక్షర లిఖితమయ్యాయి. బయట ప్రపంచం పరవశించి వాడుకుంటున్న లేపాక్షి డిజైన్లన్నీ ఈ కల్యాణ మండపం స్తంభాల్లోనివే.

నిజమయిన పూసల హారాలతో తీర్చిన అంచులు, అల్లిన తోరణాలు ఇక్కడి రాతి అంచుల హారాలు, తోరణాల ముందు సిగ్గుతో తలదించుకోవాలి.

సీతమ్మ పాదం:-

కళ్యాణ మండపం పక్కన సీతమ్మ పాదంలో ఎంతటి మండు వేసవిలో అయినా నీరు ఇంకదు. ఎత్తయిన చోట రాతి పాదంలో నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ పాదంలో నీళ్లు నెత్తిన చల్లుకుని, తీర్థంగా తాగడం ఒక ఆచారం.

రాతి కంచాలు:-

సీతమ్మ పాదం పక్కనే రాతి కంచాలున్నాయి. శిల్పులు భోజనాలు చేయడానికి చెక్కుకున్న కంచాలు అని కొందరంటారు. పైకప్పులపై (ఫాల్స్ సీలింగులకు)వర్ణ చిత్రాలు వేయడానికి రంగులు కలుపుకోవడానికి అని కొందరంటారు. రెండూ నిజం కావచ్చు. రెండిటిలో ఒకటి నిజం కావచ్చు.

Lepakshi Temple

-పమిడికాల్వ మధుసూదన్

 

ఇవి కూడా చదవండి:

‘లేపాక్షి’కి అరుదైన గౌరవం

 

ఇవి కూడా చదవండి:

అంతర్జాతీయ ఖ్యాతి ఎవరిగొప్ప?

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com