Tuesday, September 24, 2024
HomeTrending Newsకుటుంబ పాలనతో అవినీతిమయం - ప్రధాని మోడీ

కుటుంబ పాలనతో అవినీతిమయం – ప్రధాని మోడీ

తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా… అపూర్వ స్వాగతం పలికారన్నారు. ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడికి హైదరాబాద్ బేగుంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో బిజెపి శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అన్న మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత దేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారని, టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారని, ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగాలు చేశారని ప్రధాని గుర్తు చేశారు.

అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని, ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని పరోక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై విమర్శలు సంధించారు. నిరంకుశ పాలనతో తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదని, కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటు జరగలేదన్నారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష అన్న ప్రధాని కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని మోడీ స్పష్టం చేశారు.

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని, దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నామన్నారు. 8 ఏళ్లల్లో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించామని ప్రధాని వెల్లడించారు. టెక్నాలజీ పైన అపారమైన నమ్మకం ఉందని, నేను సాంకేతికతను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మనని పేర్కొన్నారు. అంధవిశ్వాసులతో తెలంగాణకు ప్రయోజనం లేదని, కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుందన్నారు. మేం పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లమని, భాజపా కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు అని ప్రధానమంత్రి మోడీ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్