Festival of Kites:
“పదపదవే వయ్యారి గాలిపటమా!
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా!
ప్రేమగోలలోన చిక్కిపోయినావా!
నీ ప్రియుడున్న చోటుకై పోదువా!
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా
నీకు ఎవరిచ్చారే బిరుదు తోక?
కొని తెచ్చావేమో అంతేగాక…
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక”
చిత్రం : కులదైవం (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (జూనియర్)
గానం : ఘంటసాల, జమునారాణి
తెలుగు సినిమా పాటల చరిత్రలో తండ్రి- కొడుకులయిన సముద్రాల రాఘవాచార్య- సీనియర్, సముద్రాల రామానుజాచార్య- జూనియర్ నిజంగా ఇంటిపేరుకు సరిపోయిన సముద్రమంత వారు. సంస్కృతాంధ్ర సాహిత్యాల లోతులు చూసి…వాటి సారాన్ని సామాన్యులు మాట్లాడుకునే భాషలో పాటలుగా మలచిన సముద్రాల ఒరవడి తరువాత ఎందరికో దారిదీపం అయ్యింది. గంభీరమయిన వేదాలు, పురాణాలు, వేదాంతాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత సరళంగా వారిద్దరూ పాటల్లో ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? అన్న విషయం తరువాత ఎప్పుడయినా చర్చించుకుందాం.
సంక్రాంతి సందర్భంగా ఆకాశంలో ఎగిరే వేనవేల గాలిపటాలేవీ అందుకోలేని సముద్రాల జూనియర్ పదచిత్రాల గాలిపటం గురించి కాసేపు ఆలోచించాలి. సముద్రాల గాలిపటం తరువాత సినిమాల్లో, బయట ఇంకా ఎన్నో గాలిపటాలు తోక కట్టుకుని ఎగరడానికి ప్రయత్నమయితే చేశాయి కానీ…అంతెత్తుకు ఎగరలేకపోయాయి.
సినిమాలో హీరో- హీరోయిన్ ప్రేమ సంభాషణ మధ్య పుట్టిన పాట ఇది. గాలిపటాన్ని సంబోధిస్తూ పద పద మంటూ పల్లవి ఎత్తుగడే భలే ఉంటుంది. ఆ ఒయ్యారి గాలిపటంతో పాటు వింటున్నవారు కూడా రెక్కలు కట్టుకుని రివ్వున గాల్లోకి ఎగరాల్సిందే.
పక్షిలా ఎగురుతూ, పక్క చూపులు చూస్తూ తిరుగుతోంది గాలిపటం. ప్రేమలో చిక్కిన ఈ గాలిపటం ప్రియుడున్న చోటును వెతుక్కుంటోంది. ప్రేమ ముప్పిరిగొన్న దాని తళుకు, కులుకు ఎందుకో చెప్పాల్సిన పనిలేదు.
“నీకు ఎవరిచ్చారే బిరుదు తోక?”
అన్న ప్రశ్నలో చమత్కారం ఉంది. తోక గాలిపటానికి గుండెకాయ. తోకతెగిన గాలిపటం ఎగరలేదు. గాలిపటానికి తోకను బిరుదుగా ఎవరో తగిలించారట. వెంటనే…కొని తెచ్చావేమో అంతేగాక! అని ‘తోక’కు ‘గాక’ ప్రాస ముగింపుతో గేయకవితా న్యాయం చేసిన సముద్రాలకు సకల గాలిపటాలు కృతజ్ఞతతో తోకలు ఊపుతూ నిత్యం సలాము చేస్తూ ఉండాల్సిందే.
రాజులెందరు గెలిచినా, ఓడినా, ఊడినా, ఉన్నా, పోయినా…
మోజులెంత మారినా…మారకున్నా…
తెగిపోకుండా నిలిచింది ఈ గాలిపటం తోక. ముగింపులో గాలిపటం తోక పట్టుకుని అంతులేని వేదాంతసారం లాంటి శాశ్వత సత్యాన్ని ఆవిష్కరించారు సముద్రాల.
సముద్రమంత భావాన్ని అత్యంత తేలికయిన మాటలతో తోక కట్టి సముద్రాల గాల్లో ఎగరేసిన గాలిపటం ఇది. ఎగిరే ప్రతి గాలిపటంలో సముద్రాలను గుర్తుకు తెచ్చే పతంగ రచన ఇది.
ఇప్పుడు కాగితం మాటున ప్రాణమున్న గాలిపటం మీ ముందు కనిపిస్తోందా?
పద…పదండి…
దాంతో మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతూ ఎగరేయండి.
సంక్రాంతి శుభాకాంక్షలతో…
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]