Monday, January 20, 2025
HomeTrending Newsలోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ కీలకం

లోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ కీలకం

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్(5), జార్ఖండ్(4), ఒడిశా(4) జమ్ము కశ్మీర్(1), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఉత్తర ప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(8) రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో… తెలంగాణ(17), ఆంధ్రప్రదేశ్(25) రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. నాలుగో విడతతో మధ్యప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల తంతు ముగుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు నాలుగో విడతలోనే పూర్తి కానున్నాయి. 175 స్థానాల్లో ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ సమయం ముగిసే లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చే వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (కన్నౌజ్), అసదుద్దీన్ ఒవైసీ(హైదరాబాద్), మహువా మైత్రా(కృష్ణనగర్) అదిర్ రంజన్ చౌదరి(బెర్హంపూర్), శత్రుగ్న్ సిన్హా (అసంసోల్) వంటి నేతల భవితవ్యం నాలుగో దశ పోలింగ్ సందర్భంగా తేలిపోనుంది.

నాలుగో విడత ఎన్నికలతో దేశంలో సగానికి పైగా(381) లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో ఏ పార్టీకి మెజారిటి రానుంది… ఓటరు నాడీ ఏ విధంగా ఉందనేది రాజకీయ పార్టీలకు, విశ్లేషకులకు దాదాపు అవగతం అవుతుంది. రాబోయే మూడు దశల్లో (163) స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. రేపటి వోటింగ్ సరళి ముగియగానే పార్టీల విధానాలు, నేతల ప్రసంగాల శైలితో గెలుపు ఓటములు నిర్దారణ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్