Lokesh for Students: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పెద్దగా కోవిడ్ లక్షణాలు ఏవీ లేవని, బాగానే ఉన్నానని, అయినా సరే హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎంకు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు పోదిగించాయని లోకేష్ గుర్తు చేశారు.
15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడ వద్దని లోకేష్ సూచించారు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు.
Also Read : విద్యాసంస్థల మూసివేతకు తొందరెందుకు