తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు యాత్ర 1200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు.
అధికారంలోకి రాగానే 22 వేల ఎకరాలకు నీరు, 60వేల మందికి తాగునీరు అందించే మిడుతూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని లోకేష్ హామీ ఇస్తూ శిలా ఫలకంలో ఈ మేరకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోకేష్ వెంట మాజీ మంత్రి, టిడిపి బిసి విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బి. తిరుమల నాయుడు, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అంతకుముందు లోకేష్ తనను కలిసిన ఎస్సీ సామాజిక వర్గం ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. రూ. 28,147 కోట్ల రూపాయల ఎస్సీ నిధులు దారి మళ్లించిన దళిత ద్రోహి సిఎం జగన్ అని అభివర్ణించారు. ఎస్సీ పథకాలపై ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే దళితులు, మైనార్టీల పునరుద్ధరిస్తామని, ఎస్సీలకు స్టడీ సర్కిల్స్, విదేశీ విద్యకు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లిలో మైనార్టీ యువకుడు అక్రమ్ ను, నరసరావుపేటలో మసీదు ఆస్తుల రక్షణకు పోరాడిన ఇబ్రహీం ను వైసీపీ పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.