అధికారంలోకి రాగానే చేనేతను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలు ఎక్కువమంది ఉన్న ప్రాంతాల్లో వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కులవృత్తులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, గతంలో తమ హయంలో యార్న్, రంగులు, పట్టుకు సబ్సీడీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, ఈ పాలనలో చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో 55 మంది ఆత్మహత్య చేసుకున్నారని, కనీస పరిహారం రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరులో పర్యటిస్తున్న లోకేష్ స్థానిక సొసైటీ కాలనీలో చేనేత కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మగ్గాలను పరిశీలించి, ప్రభుత్వం నుండి వస్తున్న సాయంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికురాలు కామర్తి జయశ్రీ తమ ఆవేదనను లోకేష్ కు వివరించారు. సొంత మగ్గం లేక కూలీకి వచ్చి చేస్తున్నామని, సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుండి రుణాలు కూడా ఇవ్వడంలేదని వాపోయారు. ఉచిత విద్యుత్ అందిస్తే బాగుంటుందని, మగ్గంతో వచ్చే కూలీతో ఇళ్లు కూడా గడవడం లేదని లోకేష్ దృష్టికి తీసుకు వెళ్ళారు. అందువల్లే తాను బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ పెట్టుకున్నానని, క్లస్టర్ ఏర్పాటు చేస్తే సంక్షేమ పథకాలు మాకు నేరుగా అందుతాయని తెలిఒపారు. టీడీపీ హయాంలో రూ. 300 వచ్చే విద్యుత్ బిల్లు ఇప్పుడు 800 వస్తోందని, గ్యాస్ ధర, నిత్యవసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయని గోడు వెళ్లబోసుకున్నారు.
దీనిపై స్పందించిన లోకేష్… ఆప్కో ద్వారా గతంలో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేతలకు ఆదుకున్నామని, చేనేతలకు ఏం చేస్తే బాగుంటుందో తనకు అవగాహన ఉందని, అధికారంలోకి రాగానే నేతన్నలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు,.