Monday, January 20, 2025
HomeTrending Newsకుప్పం బ‌రిలో లోకేష్‌

కుప్పం బ‌రిలో లోకేష్‌

ఏపీలో 2024 సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చావోరేవో తేల్చుకోనున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా జల్లెడ పడుతూ అక్కడ పార్టీని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఇన్చార్జి లేని నియోజకవర్గాలపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇక చంద్రబాబు కి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం ఒక సవాల్ అయితే … ఇక రెండో సవాల్ తన కంచుకోట అయిన కుప్పంను మరోసారి నిలబెట్టుకోవాలి. అలాగే గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన తన తనయుడు లోకేష్ ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాలి.

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాల్సి ఉంది. లోకేష్ ను అసెంబ్లీ పంపేందుకు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఆపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోకేష్ ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయించి… చంద్రబాబు మంగళగిరి అసెంబ్లీ బరిలోకి దిగుతారని తెలుస్తోంది.

కుప్పం చంద్రబాబుకు కంచుకోట. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్కడ గట్టిగా ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టింది. అయితే సాధారణ ఎన్నికల నాటికి అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. పైగా లోకేష్ యువకుడు కావడం కూడా కుప్పంలో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక చంద్రబాబు కృష్ణ – గుంటూరు జిల్లాల‌లో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈ రెండు జిల్లాల్లో పార్టీకి మరింత ప్లస్ అవుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రెండు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు సైతం బాబును ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తే ఎలా ? ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు లోకేష్ ను కుప్పం బరిలో దింపి… తాను మంగళగిరి నుంచి పోటీచేస్తే సంచలనమే అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్