NCS Dues to Farmers:
తమ బకాయిల కోసం పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై సిఆర్పీసి 41ఏ కింద కేసులు నమోదు చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లోకేష్ లేఖ రాశారు.
విజయనగరంలోని ఎన్‌సిఎస్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు దాదాపు 17 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిల కోసం 20 రోజుల నుంచీ వారు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని లోకేష్ తప్పు బట్టారు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ గళమెత్తిన రైతులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారని ఇది గర్హనీయమని పేర్కొన్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని లోకేష్ ప్రశ్నించారు.
బొబ్బిలి, సీతానగరం మండలాలకు చెందిన 80 మంది రైతులకు నోటీసులు ఇచ్చి బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాలని చెప్పడం రైతులను మరింత మానసిక క్షోభకి గురిచేయడమేనని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసి బకాయిలు చెల్లించేలా చూడాలని సిఎంకు లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Also Read : విజయనగరమంటే విజయనగరమే