Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇకపై వర్చువల్ ప్రాణులు

ఇకపై వర్చువల్ ప్రాణులు

Metaverse: Diving into a whole New World

బ్రహ్మ సత్యం- జగత్తు మిథ్య. కానీ మనకు జగత్తు సత్యం- బ్రహ్మ మిథ్యగా కనిపిస్తూ, అనిపిస్తూ ఉంటుంది. మనముంటున్న, మనం చూస్తున్న, మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచం నిజంగా నిజం కాదంటుంది బ్రహ్మ సత్యం భావన. ఇదొక మాయ. అద్దంలో ప్రతిబింబాన్నే అసలు రూపమనుకుంటున్నామట. మరి మన మనసు అద్దాల్లో, మాంస నేత్రాల్లో పట్టనంతగా కనిపిస్తున్న ఈ ప్రతిబింబానికి అసలు రూపం ఇంకెంత పెద్దగా ఉంటుందో?

అంటే ఈ సృష్టి ఒక ఇల్యూజన్ – భ్రాంతి. ఇది భ్రాంతి అంటే భౌతికవాదులకు విభ్రాంతి కలుగుతుంది. జగత్తు మిథ్య అని నమ్మితే ఎంత సుఖమో!

థియేటర్లో స్క్రీన్ మీద సినిమా ఆడుతుంటే పాత్రలు కదులుతూ ఉంటాయి. అయిపోగానే తెల్లటి తెర ఒక్కటే మిగిలి ఉంటుంది. అలా మనం కూడా ఒక మాయ తెరమీద ఎవరో ఆడిస్తే…ఆడే బొమ్మలం. ఆడించేవాడి చేతిలో పాత్రలం. సినిమా తెర మీద నీడలే కానీ- మనుషులుండరు. ఈ మాయ తెర మీద కూడా నీడలే కానీ- మనం చూసే ప్రపంచం నిజంగా ఉండదు. ఇంతకంటే జగత్తు మిథ్య విషయంలో లోతుగా వెళ్లడానికి ఇది వేదిక కాదు.

జగత్తు మిథ్య అన్న ఎరుక కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మనమే సరిగ్గా పట్టించుకోకుండా వాటిని మిథ్యగా కొట్టిపారేస్తూ ఉంటాం.

నగదు మిథ్య
ఒక శుభ సాయంత్రం మన చేతిలో ఉన్న నగదు మిథ్యగా మారిపోతుంది. అంతవరకు చెల్లిన నోటు ఆ క్షణం నుండీ చిల్లులు పడకపోయినా చెల్లనిది అయిపోతుంది. డబ్బే సర్వస్వమ్ కాదు అని వేదాంత వైరాగ్యం కలిగించడమే నోట్ల మిథ్య ఉద్దేశం తప్ప, జనాన్ని బాధించాలన్న శాడిజం ఏ కోశానా లేదు. క్యాన్సర్ వస్తే ఆ భాగాన్ని నిర్దయగా కోసి పారేయాలి. లేకపోతే క్యాన్సర్ ఒళ్లంతా పాకి ప్రాణాన్ని మింగేస్తుంది. అలాగే డబ్బు అనే గబ్బు జబ్బు క్యాన్సర్ లా జనాన్ని పట్టి పీడిస్తుంటే…దయగల ప్రభుత్వం నగదును రాత్రికి రాత్రి మిథ్యగా మార్చి వైద్యం చేసింది. దీన్నే “ధన మిథ్యా వైద్యం” లేదా “ధన భ్రాంతి వైద్య మిథ్య” అని అంటారు.

“వైద్యం మిథ్య- ధనం సత్యం” మరో వాస్తవిక వేదాంతం. అది ఇక్కడ అసందర్భం. ఇంకెప్పుడయినా మాట్లాడుకుందాం.

ఓటు మిథ్య
మన ఓటు మనమే వేసి, మన ప్రభుత్వాన్ని మనమే కూర్చోబెట్టడానికి ఓటుకు నోటు అవసరమవుతుంది. ఓటు ద్రవీకరణ చెంది ఓటుకొక బాటిల్ కోరుంటుంది. కైపెక్కిన ఓటు తూలుతూ ఎవరికి ఓటు నొక్కిందో దానికే తెలియదు. ఓటిపడవలోకి నీరు చేరి పడవ మునుగుతుంది. ఓటు పండగలోకి మందు చేరి ప్రజాస్వామ్యం పడవ మునుగుతూ ఉంటుంది. చెల్లిన నాలుగు ఓట్లలో, నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో…రెండు ఓట్లు పడ్డ అభ్యర్థి ఒక్కోసారి అఖండ విజయంతో ఊరేగుతూ ఉంటాడు.

ప్రయివేటు సత్యం – ప్రభుత్వం మిథ్య
దీనికి ఉదాహరణ చెబితే సూర్యుడి ముందు దివిటీ పెట్టినట్లు ఉంటుంది. నడిచే రోడ్లు, ఎక్కే రైలు, విమానం, నౌక, తాగే నీరు, పీల్చే గాలి…సమస్తం ప్రయివేటు. మన ప్రయివేటు జీవితాలు ఒక్కటే ప్రభుత్వ పరం అయి పెగాసస్ చల్లని చూపుల్లో పడి ఉంటాయి.

చదువు మిథ్య
చదువు నారాయణ నారాయణ అనుకుంటూ చైతన్యాన్ని వెతుక్కుంటూ ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి అని రెండు అంకెలోకి ఎప్పటికీ రాని మిథ్యగా ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఉన్నా…మెడిసిన్, ఇంజినీరింగ్ తప్ప మిగతా చదువులన్నీ అక్షరాలా మిథ్యగా మనమే అంగీకరించాం.

పరువు మిథ్య
ఇది ఉందనుకుంటే ఉంది. లేదనుకుంటే లేదు. ఉందనుకున్నప్పుడు లేదని ఎదుటివారు నిరూపిస్తూ ఉంటారు. లేదనుకున్నప్పుడు ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ ఉంటారు.

నిజం మిథ్య
నిండు నిజానికి నిలువ నీడ ఉండదు. ఇజాలన్నీ నిజాలు కాకపోవచ్చు. ఎవరి ఇజం వారికి నిజం- మిగతావారికి మిథ్యగా అనిపిస్తుంది. అసలు ఈ జగమే ఒక మిథ్య అని ముందే తేల్చి పారేసినప్పుడు ఇక అందులో నిజం ఒక నిజమయిన మిథ్య కాకుండా పోయే అవకాశమే లేదు.

ఇన్ని మిథ్యల మధ్య సాంకేతికంగా నిజంగా ఒక మిథ్యా ప్రపంచాన్ని సృష్టించడానికి జరుగుతున్న అతి పెద్ద ప్రయత్నం నిజమైన వార్తగా కాకుండా పోయింది. ఈరోజుల్లో ఆన్ లైన్ క్లాసులు, వర్చువల్ మీటింగులు, వీడియో కాల్ పౌరోహిత్యాలు, జూమ్ లో పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. ప్రపంచం వెలుగు- నీడలతోనే బతకాలి.

వర్చువల్ టెక్నాలజీకి కూడా వెలుగు- నీడలే ఆధారం. మన కంట్లో పడేది కూడా వస్తువు ప్రతిబింబమే. వస్తువు వెలుగు- చీకట్లో అక్కడే ఉంటుంది. వెలుగు పడితే కన్ను చూడగలుగుతుంది. చీకటి ఉంటే చూడలేదు. కానీ చీకట్లో కూడా అదే కన్ను…అదే వస్తువు…ఏదీ మారలేదు. కెమెరా లెన్స్ వెలుగులో చిత్రాన్ని క్యాప్చర్ చేసినట్లే కంటి లెన్స్ లో చిత్రం ప్రతిబింబంగా పడుతుంది. దాన్ని మెదడు విశ్లేషించుకుంటుంది. కన్ను వస్తువును చూడగలదు కానీ- తన కంటిని తానే చూడలేదు. అదొక సృష్టి వైచిత్రి. ఇంతకంటే లోతుగా వెళితే అది కంటి వైద్యుల సబ్జెక్ట్ అవుతుంది.

డాక్టర్లు, లాయర్లు, టీచర్లు ఎదురుగా వచ్చి కూర్చుని మాట్లాడుతున్న అనుభూతి కలిగించేలా వర్చువల్ రియాలిటీ- వి ఆర్; అగ్మెంటెడ్ రియాలిటీ- ఏ ఆర్ కలగలిపిన “మెటావర్స్” అంటే మిథ్యా ప్రపంచం త్వరలో ఆవిష్కారం కాబోతోంది. దీనికోసం దిగ్గజ కంపెనీలు ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు పెట్టాయి. మెటా అంటే మార్పు. యూనివర్స్ లో చివరి మాట వర్స్ కు ముందు మెటా చేర్చి ఈ మాటను కాయిన్ చేశారు.

ఈ మిథ్యా జగత్తులో మరో మెటా మిథ్య. భవిష్యత్తులో మీరు తల నొప్పితో ఆసుపత్రికి వెళితే అక్కడ మీకు వైద్యం చేసింది ఈ మెటావర్స్ సృష్టించిన వెలుగునీడల వర్చువల్ డాక్టర్ కావచ్చు. ఉప్మాలో జీడిపప్పు వేయలేదని భార్యాభర్తలు గొడవపడి విడాకుల లాయర్ దగ్గరికి వెళితే ఆ లాయర్ లేజర్లు నిర్మించిన వర్చువల్ ప్రాణి కావచ్చు.

ఎవరు వర్చువలో? ఎవరు అసలో? కనుక్కోలేక నిజం అబద్ధం; అబద్ధం నిజమై-
“బ్రహ్మ సత్యం- జగన్మిథ్య”
సూత్రాన్ని చచ్చినట్లు ఒప్పుకోవాల్సి రావచ్చు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఆన్ లైన్ దోపిడీ

Also Read: సంసారాల్లో డిజిటల్ చిచ్చు

RELATED ARTICLES

Most Popular

న్యూస్