Saturday, September 21, 2024
HomeTrending NewsNirudyoga Nirasana: కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి - రేవంత్ రెడ్డి

Nirudyoga Nirasana: కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి – రేవంత్ రెడ్డి

“ తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే.. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్.. 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్ లో కలెక్టరేట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణను పట్టి పీడిస్తున్న కొరివి దెయ్యం కేసీఆర్. కేసీఆర్ ను తెలంగాణ పొలిమేరలదాకా తరిమెందుకు వచ్చిన మీ స్ఫూర్తి అభినందనీయం అని రేవంత్ సభకు వచ్చిన వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే.. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ.. కష్టపడి చదివిన పేద విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప..ప్రజలు బాగుపడలేదన్నారు. కేసీఆర్ తన పాలనలో కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే పదవులు ఇచ్చుకుండు. కానీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు? చదువుకున్న దళిత, బీసీ బిడ్డలను మోసం చేసిన కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు తగలదా?
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి..ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దక 25 మంది విద్యార్థులు చనిపోయారు. భద్రంగా దాచాల్సిన ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. టీఎస్ పీఎస్ సీ ప్రశ్నా పత్రాలు ఇవాళ బజార్లో అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే.. టీఎస్పీఎస్సీ బోర్డుపై నమ్మకం పోయిందన్నారు. దీనికి కారణమైన కేసీర్ కుటుంబాన్ని బజారుకు ఈడ్చాలి అని రేవంత్ అన్నారు. ప్రశ్న పత్రాల లేకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అన్న డిమాండ్ ను మరోసారి పునరుద్ఘాటించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అనే మరో సారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొత్త ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ లో ఎవరూ అధైర్య పడొద్దు..ఈ జోకుడు రామన్నలు చేసేదేం లేదని పార్టీ కార్యకర్తలకు రేవంత్ భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ కు జోగు రామన్మ చేసిందేమి లేదని.. జోకుడుతోనే జోగురామన్న మంత్రి ఆయన కొడుకు మున్సిపల్ చైర్మన్ అయ్యిండని ఆరోపించారు.
పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తక్షణమే తొలగించాలి అని డిమాండ్ చేశారు. రాజయ్యను బర్తరఫ్ చేసినట్లే.. ప్రశ్నాపత్రాల కుంభకోణానికి కారణమైన కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ ని అరెస్టు చేస్తే.. రాత్రి జైలుకు వెళ్లి ఉదయాన్నే బయటకు వచ్చారు. మా విద్యార్థి, యువజన నాయకులను అరెస్టు చేసి వారం రోజులు జైల్లో ఉంచారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు.

ఆదిలాబాద్ నిరుద్యోగ నిరసన ర్యాలీకి వెళ్తూ కామారెడ్డి జిల్లా పొందుర్తి గ్రామంలో పంటనష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు రేవంత్ రెడ్డితో తమ ఆవేదనను పంచుకున్నారు. తర్వాత మాట్లాడుతూ.. వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారు అన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టం అంచనా వేసి.. ఎకరాకు 20 వేలు, మామిడి తోటలకు ఎకరాకు 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలి. ధాన్యం కొనకుండా ఆ నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై నెట్టె ప్రయత్నం చేస్తున్నారు..కేంద్రం కొంటేనే కొంటామని అంటే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

పంట నష్టం పరిశీలించకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ లు చేసుకుంటున్నారు అని బీఆర్ఎస్ పార్టీ తీరును తుర్పారబాట్టారు. 18 మంది సన్యాసి మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నుంచి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం పై నివేదికలు ఇస్తాం. రైతులకు మనో ధైర్యం కల్పిస్తాం. దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆరునెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేస్తాం అని రేవంత్ హామీ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే.. అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్