Cabinet Expand : బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు బెంగళూరు రావటం చర్చాప చర్చలకు దారి తీస్తోంది. ఒక రోజు పర్యటన కోసం వచ్చిన అమిత్ షా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్న షా కన్నడ బిజెపిని గాడిలో పెట్టేందుకు వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసేందుకే అమిత్ షా వచ్చారని పార్టీ నేతలు అంటుండగా ముఖ్యమంత్రి మార్పు దిశగా చర్యలు చేపడతారని మీడియా కథనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు అటుంచితే మంత్రి వర్గ విస్తరణ చేస్తారని జోరుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు అధికారిక కార్యక్రమాలు పూర్తి అయ్యాక సాయంత్రం వెళ్ళేటపుడు సిఎం బొమ్మైతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని త్వరలోనే మార్చేస్తారనే చర్చ మాత్రం హీట్ పెంచుతోంది.. ఈరోజు బెంగళూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. కాగా, అన్ని చోట్లా మార్పులు ఉంటాయని నేను చెప్పడం లేదు.. కానీ, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఊహించని నిర్ణయాలు బీజేపీ తీసుకోగలుగుతుందని బిజెపి ప్రధాన కార్యదర్శి సంతోష్ పేర్కొన్నారు. పార్టీపై ఉన్న విశ్వాసం మరియు సంకల్పం కారణంగా, ఈ నిర్ణయాలు సాధ్యమయ్యాయని, గుజరాత్‌లో, ముఖ్యమంత్రిని మార్చారు, మొత్తం కేబినెట్‌ను కూడా మార్చారు. ఇది తాజాదనాన్ని నింపాలనే ఉద్దేశ్యంతో జరిగిందని సంతోష్ తెలిపారు. బీఎస్ యెడియూరప్ప స్థానంలో మిస్టర్ బొమ్మై వచ్చిన ఒక సంవత్సరంలోపే కర్ణాటకలో మరోసారి మార్పు తప్పదనే చర్చకు మాత్రం దారితీసింది. ఈ పుకార్లపై సీఎం బొమ్మై స్పందించలేదు.. ఇదే సమయంలో రెండు వారాల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.