Movie Review: తమిళనాట ఈ నెల 4వ తేదీన ‘లవ్ టుడే’ సినిమా విడుదలైంది. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా ప్రదీప్ రంగనాథన్ వ్యవహరించాడు. చూడగానే ఒక్కప్పటి ధనుశ్ లా కాస్త పీలగా కనిపిస్తాడు. దానికి తోడు ధనుశ్ కి డబ్బింగ్ చెప్పించినవారితోనే ఇతనికి కూడా డబ్బింగ్ చెప్పించారు. దాంతో తెరపై అప్పుడప్పుడు ధనుశ్ ను చూసిన ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ప్రదీప్ కూడా తెలివైనవాడే, తన పర్సనాలిటీకి తగిన కథను .. సన్నివేశాలనే రాసుకున్నాడు.
ప్రదీప్ సంగతి అటుంచితే ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకులను కదలకుండా చేసే బాధ్యతను హీరోయిన్ ‘ఇవాన’ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో ఈ బ్యూటీ ఆకట్టుకుంటుంది. చారడేసి కళ్లతో కుర్రకారు ప్రేక్షకుల మనసులను దోచేస్తోంది. ఇక అభినయం పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది. అమ్మాయికి డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై కనిపించిన అందమైన కథానాయికలలో ఈ అమ్మాయికి చోటు ఇచ్చి తీరవలసిందే అనేది కుర్రాళ్ల మాట.
2012లోనే చిన్న చిన్న పాత్రలతో మలయాళ సినిమాల ద్వారా తన ప్రయాణాన్ని మొదలెట్టిన ఈ సుందరి, 2018లో తమిళ తెరకి పరిచయమైంది. ‘లవ్ టుడే‘ హిట్ తో ఇప్పుడు అందరి కళ్లలోను పడిపోయింది. ప్రస్తుతం తెలుగులో కుదిరితే కృతి శెట్టి .. లేదంటే శ్రీలీల అనే పరిస్థితి ఉంది. అందువలన ఇకపై ఇవనా పేరును పరిశీలించే అవకాశాలు ఉండొచ్చు. రామ్ .. నితిన్ .. నాగశౌర్య వంటి హీరోల జోడీగా ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ అవుతుందేమో చూడాలి.