Roar of Rhyme:
“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే
త్వం జీవ శరదశ్శరం
వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ?
ఏందే నీ మాయ!
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ?
పోయిందే సోయ!
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటినాకీ తడబాటసలేందే
ఉందే దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అధోగతి
అన్యాయంగా మనసుని గెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగ ఘోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళావీ కళావతి కల్లోలమైందే నా గతి
కురులావి కళావతి కుళ్ళబొడిసింది చాలుతీ…”
ఆ మధ్య సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసినప్పుడు నివాళిగా నేనొక వ్యాసం రాస్తూ…సముద్రాలలు, పింగళుల నుండి తెలుగు పాటల పల్లకీని వినువీధుల్లో విహరింపజేసిన రచయితల్లో సిరివెన్నెల చివరివారు అని ఒక మాటన్నాను. ఒక పేరున్న రచయిత, మరో పేరుపొందిన దర్శకుడు ఆ మాట మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు భాషాభిమానిగా వేటూరులు, సిరివెన్నెలలు భవిష్యత్తులో కూడా పుడతారన్న వారి ఆశ నాకు నచ్చింది కానీ…వాస్తవానికి పరిస్థితి నానాటికి తీసికట్టు.
ముప్పయ్ ఏళ్ల కిందట దూరదర్శన్లో ప్రఖ్యాత హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం “ఆనందో బ్రహ్మ” పేరిట హాస్య కదంబ కార్యక్రమం నిర్వహించేవారు. ఈ కార్యక్రమానికి ఆయనే రచయిత, దర్శకుడు, నటుడు…అన్నీ.
అందులో ఒక ఉగాది ఎపిసోడ్లో కవిగా ధర్మవరపు చెప్పిన కవిత ఇది:-
“నీ మదిలో ఉగాది
నా మదిలో ఉగాది
మది మదిలో ఉగాది
ప్రతి మదిలో ఉగాది
ఆ గదిలో ఉగాది
ఈ గదిలో ఉగాది
మది గదిలో ఉగాది
గది మదిలో ఉగాది
గది గదిలో ఉగాది
ఈ ఉగాది అనాది
ఈ ఉగాది దగాలది
ఈ ఉగాది ఎగాదిగాది”
ఇప్పుడు మళ్లీ పైకి రోల్ చేసుకుని కుళ్లబొడిచిన కళావతిని చదువుకోండి.
“ఒక వెయ్యో, లక్షో తెలుగు పాట మెరుపులు మీ మీదికి దూకినాయా? ఆ కమ్మాన్ కళావతి మీ వీధి కమానుగా, మాయా తోరణంగా వేలాడుతోందా? మీ ముందో అటు పక్కో ఇటు పక్కో కిందో పైనో చిలిపిగ తీగలు సాగి మోగినాయా? సోయా బీన్స్ పంట మొత్తం పోయిందా? దడగుందా? విడిగుందా? జడుసుకున్నారా? మీ గతి అధోగతికన్నా హీనంగా దుర్గతిలోకి జారిందా?
అన్నం మానేసి అన్యాయంగా పాటను గెలికారా? దుర్మార్గంగా నిద్ర మానేసి పాటలో పదాల గురించి ఆలోచిస్తున్నారా? రంగ అనే వ్యక్తి మీ కలను ఘోరంగా రంగ రంగ వైభవంగా అంగరంగ వైభవంగా గునపం పెట్టి తవ్వి తట్టి మీ చేతిలో పెట్టాడా? దొంగ చించి ఇరికించి అతికించి విదిలించి వదిలించుకుని వెళ్లిన నోట్లు చెల్లడం లేదా?
మీ చెడిన బతుకు కల్లోలమై నడిసంద్రంలో చుక్కాని లేని నావ అయ్యిందా?
కురులారబోసుకున్న కళావతి ఆ పట్టులాంటి కురులతోనే మిమ్మల్ను కుళ్లబొడిచిందా?
ఇంక చాలు తీ!”
ధర్మవరపు ఉగాదిలో ‘ది’ ప్రాస.
కమ్మాన్ కళ్లావత్తిలో ‘తి’ ప్రాస.
ఆ ప్రాస హాస్యం.
ఈ ప్రాస అపప్రాస్యం!
మాంగల్యం మంత్రం కోరస్ లో తనను తానే తన్నుకుని తడబడింది. శుభగే అని వినిపిస్తోంది. సుభగే అని ఉండాలి. శరదశ్శరం అని వినపడుతోంది. శరదాం శతం అని ఉండాలి. మంత్రమేమిటో, అందులో మాటల అర్థమేమిటో, ఎలా పలకాలో, ఎలా పాడకూడదో తెలియకుండా మంత్రించి కళావతి మొహాన పదాల పేడతో కళ్లాపి చల్లినట్లున్నారు. మీకు సరిగ్గా వినపడి ఉంటే నా చెవులను మన్నించండి.
మాంగల్య మంత్రంతో మొదలయిన పాటలో చివర…
మంత్రహీనం
క్రియాహీనం
శ్రద్ధా హీనం…ఉపసంహార మంత్రం కూడా ఉండి ఉంటే వేదోక్తంగా ఉండి ఉండేది!
గేయరచయితలు కుళ్లబొడిచి, చించి, వంచి, అతికించి, ఇరికించి, మెలిపెట్టి, ముడిపెట్టి, మెడపట్టి, తొడగొట్టి, గిల్లి, గిచ్చి, రక్కి రక్తపాతం సృష్టిస్తున్నా తెలుగు ప్రేక్షకులు…ఇంకా బతికి బట్టకట్టుకోగలుగుతున్నారంటే ఏయే జన్మల్లో ఎన్నెన్ని పుణ్యాలు చేసుకున్నారో? ఈ జన్మలో వినకూడనివి వింటూ ఎన్నెన్ని పాపాలు మూటకట్టుకుంటున్నారో?
పాపం…పోయిందే సోయా!
-పమిడికాల్వ మధుసూదన్