James Bond: ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఆర్.మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆయన హీరోగా నటిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రై కలర్ ఫిలింస్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ఆర్.మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఆర్.మాధవన్ మాట్లాడుతూ… ‘‘నంబి నారాయణన్ గారిని నేను నంబి సార్ అని పిలుస్తుంటాను. నేను విక్రమ్ వేద సినిమా చేసిన తర్వాత ఇస్రో సైంటిస్ట్‌కి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మాల్దీవులకు సంబంధించిన అమ్మాయితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పాకిస్థాన్‌కు మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను అమ్మేశాడు. ఆ నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారు. దాదాపు చంపినంత పని చేశారు కానీ సీబీఐ చేసిన దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు అనేదే కథ అన్నారు.
నాకు చాలా బాగా నచ్చింది. పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరి అనిపించింది. 2016-2017లో త్రివేండ్రంలో నంబి సార్‌ను కలిశాను. ఆయన కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి కానీ.. బాధతో కనిపించాయి. జైలులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయన నన్ను చాలా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ‘హాయ్ మాధవన్ నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ సినిమాలను చూస్తుంటాను అని అన్నారు.
కానీ కేసు గురించి మాట్లాడే సందర్భంలో నన్ను దేశ ద్రోహి అని ఎలా అంటారంటూ చాలా కోపంగా మాట్లాడారు. అప్పుడు నేను మాట్లాడుతూ ‘సార్.. ఈ కేసులో మీరు నిర్దోషి అని నిరూపించబడ్డారు కదా. ఇంకా కోపమెందుకు?’ అని అన్నాను. దానికాయన ‘ఆ విషయం నీకు, నాకు, కోర్టుకి తెలుసు. కానీ గూగుల్‌కి వెళ్లి నా పేరు కొట్టి చూడు’ అన్నారు. నేను గూగుల్‌లో నంబి నారాయణన్ అని కొట్టగానే ఆయన మనదేశ రహస్యాలను పక్క దేశానికి చేర్చిన రహస్య గూఢచారి అని ఉంది. ఆయన బాధలో నిజముందనిపించింది. తర్వాత నేను స్క్రిప్ట్ రాయడానికి ఏడు నెలల సమయం తీసుకున్నాను.
ఆయన్ని వెళ్లి కలవగానే నేను ప్రిన్స్‌టిన్‌లో చదువుకున్నానని అన్నారు. అక్కడా అందరూ ఐదారేళ్లు తీసుకునే రీసెర్చ్‌ను కేవలం పది నెలల్లోనే పూర్తి చేశారని చెప్పారు. ఆయన ఇస్రో, నాసాలకు సంబంధించిన విషయాలను గురించి చెబుతున్నప్పుడు జేమ్స్ బాండ్ బాబులా అనిపించారు . నిజమైన రాక్ స్టార్. ఆయన సాధించిన విజయాలను గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. కానీ ఆయనెప్పుడూ వాటి గురించి బయటకు చెప్పుకోలేదు. నేను చాలా ఎమోషనల్ అయ్యాను.
సినీ ఇండస్ట్రీలో స్వాతంత్య్ర వీరులపై, పౌరాణిక పాత్రలపై ఇలా చాలా వాటిపై సినిమాలు తీస్తుంటాం. కానీ వీటికి సంబంధం లేకుండా సైన్స్, టెక్నాలజీ అనే రంగంలో చాలా మంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే కారణంగా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా చేశాను. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలకు మన దేశానికి చెందిన ఇంజనీర్స్ సి.ఇ.ఓలుగా పని చేస్తున్నారు. చాలా మంది ఇండియాలో లేరు. అలాంటి వారందరూ మన దేశానికి తిరిగి రావాలి. ‘ ఈ వీ చేయడానికి ఆరేళ్ల సమయం తీసుకున్నాను.
ఎవరూ చూపించని కొత్త విషయాలను చూపించబోతున్నాం. సాధారణంగా రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూసుంటాం. కానీ ఏ సినిమాలో రాకెట్ ఇంజన్‌ను చూపించి ఉండరు. కానీ తొలిసారి ఆ రాకెంట్ ఇంజన్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమాలో ప్రాస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌గారిలా కనిపించటానికి నా దంతాల అమరికను మార్చాను. అలాగే బరువు పెరిగాను, తగ్గాను. బాహుబలి వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో మా టీమ్ కూడా అంతే కష్టపడ్డారు’’ అని తెలిపారు.