సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరని సిఎం కెసిఆర్ అన్నారు. ఏడెండ్ల క్రితం కేవలం 60 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే తెలంగాణ, ఈరోజు రెండున్నర లక్షల కోట్ల పైన బడ్జెట్ పెట్టుకొని 2 లక్షల 10వేల కోట్ల వరకు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. మహబూబ్ నగర్ నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రారంభం అనంతరం జిల్లా అధికారులు , ప్రజాప్రతినిధులు , కలెక్టరేట్ సిబ్బంది హాజరైన సమావేశమందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి పరిపాలన భవనాన్ని పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకున్న ఉద్యోగులందరికి అభినందనలు తెలియజేసారు.
కెసిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే …
ఏడెండ్ల క్రితం చాలా భయంకరమైనటువంటి కరెంట్ బాధలను అనుభవించిన తెలంగాణ ఈ రోజు దేశానికే తలమానికంగా తయారైందని తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో కూడా ఏ రాష్ట్రంలేదని, దేశంలో సగటు కూడ సమీపంలో లేని విధంగా, ఈరోజు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పడానికి నేను గర్వ పడుతున్న అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు అని, అలాంటి ఆలోచనలు కూడ ఎవరికి రావు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు . దీనంతటికి కారణం మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వారితో పాటు రెండింతల అంకితభావంతో పని చేసినటువంటి ప్రభుత్వ అధికారుల, ఉద్యోగుల కృషి వల్లనేనని సిఎం అన్నారు . ఇంతటి గొప్ప అద్భుత ఆవిష్కరణలలో కృషి చేసినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు.
*నాడు పాలమూరు జిల్లా ఎండిపోయింది..నేడు ధాన్యరాశులతో నిండిపోతున్నది … తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లాలో పర్యటించినప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు గురించి మాట్లాడుతూ
‘‘ఆ రోజుల్లో ఫ్రొఫెసర్ జయశంకర్ గారు నేను మిత్రుడు లక్ష్మా రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ వెళ్ళి వస్తావుంటే నవాబ్ పేట మండలంలో చిన్న పాటి అడవి ఉంటది . అమ్మవారి గుడి దగ్గర. నేను జయశంకర్ గారు మాట్లాడుతూ లక్ష్మారెడ్డి గారితో అన్నాము. ఏమండి లక్ష్మారెడ్డి గారు డాక్టర్ గారు మీ జిల్లాలో చెట్లు కూడ బక్కగా అయిపోయని ’’ ఇదేం అన్యాయం అనిజెప్పి మాట్టాడుకుంటూ వచ్చాం’’ అనే సంధర్భాన్ని సిఎం కేసిఆర్ గుర్తు చేసుకున్నారు. తొలి నాల్లలో మాజీ ఎమ్మెల్యే, మాజీ సమితి ప్రెసిండెంట్, ఉత్తమమైన ప్రజా నాయకుడు కీ.శే.ఎడ్మ కృష్ణారెడ్డి వారి కొడుకు ఎడమ సత్యం అప్పుడు జెడ్పిటిసి ఎన్నికల్లో పోటి జేస్తే నన్ను రమ్మని పిలస్తే, నేను వరంగల్ నుండి చాలా దూరంలో ఉన్నాను కాబట్టి హెలికాప్టర్ లో వచ్చిన. వచ్చే క్రమంలో మొత్తం నల్లగొండ, దేవరకొండ ,మునుగోడు కల్వకుర్తి మీదగా వచ్చినం, కిందకు చూస్తే ఎక్కడ చూసిన ఎండిపోయన ఎడారి ప్రాంతంలా కనబడిన నేలను చూసి కండ్లల్లో నీళ్ళు పెట్టుకుని బాధపడ్డం.
నేను అలంపూర్ జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేస్తే ఆరోజు కూడ అనేక అనుభవాలు, బాధలు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలదరించే పరిస్థితి. నడిగడ్డ లో ప్రజల పరిస్థితి చూసి మిత్రుడు నిరంజన్ రెడ్డి నేను అందరం కండ్లనీళ్ళు పెట్టుకున్నాము మేము ఏడవడమే కాదు ఆ రోజు ఊరంతా ఏడ్చారు . అప్పటి వేదనలు, రోధనలు గుండే అవిశిపోయే బాధలతోని బాధపడ్డ పాలమూరు జిల్లా, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటీవల గద్వాల వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎక్కడి వరకు దారి పొడవున ఎటుచూసిన పంట కోతలు కోసేటువంటి హర్వేష్టర్లు, దాన్యం కల్లాలలో ధాన్యం రాశులు అమ్ముతున్నటువంటి రైతులను చూసి చాలా ఆనందపడుతూ పోయినం. ఏ తెలంగాణ కావాలని కోరుతున్నాము దేని కోసం అయితే పోరాటం చేసినమో అది ఆ బాట పట్టింది. ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించాలని ముందుకు పోతున్నం అని సిఎం కేసిఆర్ గతంలో తెలంగాణ పరిస్థితులను, ప్రస్థుత పరిస్థితులను పోల్చూతూ సాధిస్తున్న ప్రగతిని తెలియజెప్పారు.
మానవీయ కోణంలో ఆలోచన చేస్తేనే ‘‘ కేసీఆర్ కిట్ ’’పథకం రూపం దాల్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకు వచ్చిందే ‘కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం అని సిఎం అన్నారు. మామూలుగా నాలుగు వస్తువులు ఇచ్చి పంపడం ‘కేసీఆర్ కిట్’ పథకం ఉద్ధేశ్యం కాదు అని అన్నారు . టీఆర్‌ఎస్ గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మధనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తాం. ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయమని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలు గర్భం దాల్చిన తర్వాత కూడా ఉపాధి కోసం పని చేస్తునే ఉంటారు. ఎందుకంటే పేదరికం, దరిద్య్రం వల్ల. అలాంటి పరిస్థితి ఉన్నది అని. కాబట్టి వాళ్లు పని చేయవద్దంటే ఒకటి ఇనిస్టిట్యూషన్ డెలివరీలు ప్రోత్సహించాలి. మరొకటి మహిళ పని చేయకపోవడం ద్వారా ఏదైతే డబ్బు కోల్పోతదో దాన్ని మనం ఇవ్వాలనేదే కేసీఆర్ కిట్ ఉద్దేశం అని సిఎం అన్నారు.
పాలమూరు జిల్లా అద్భుతంగా రూపాంతరం చెందుతుందని. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రజలను కాపాడాటానికి, ప్రజల పురోగమనానికి మనం ఉపయోగపడుతూ ముందుకు సాగాలన్నారు. ఈ ఎనిమిదేండ్ల ప్రస్థానంలో అందించిన సహాకారం మీరు ఇకముందు కూడ అదేవిధంగా అందించాలన్నారు.
సమావేశంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్ , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , మల్లారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , కలెక్టర్ ఎస్ వెంకట రావు , ఎంపీ లు , ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు , జిల్లా ప్రజాప్రతినిధులు , నాయకులు పాల్గొన్నారు.