రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమయింది. ఈ నెల ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లు నేడు సీ.ఎస్ తో సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ, భారీ వర్షాలకు దెబ్బతిన్న ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. వీటితోపాటు వరి పంట తోపాటు పత్తి పంట పూర్తిగా ధ్వంసమైందని తాము పరిశీలించినట్టు వివరించారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలూ పూర్తిగా నీటమునిగి ఆస్తి నష్టం కలిగాయని అన్నారు.
అయితే, ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ముంగుజాగ్రత్త చర్యలవల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించారని పేర్కొన్నారు. కాగా, విపత్తుల నివారణకుగాను కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలించగలమని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిప్యూటి సెక్రెటరి అనిల్ గైరోలా, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, హైదరాబాద్, రీజనల్ ఆఫిసర్ ఎస్.కె.కుష్వా, జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC, హైదరాబాద్ డైరెక్టర్, రమేష్ కుమార్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజనల్ ఆఫిసర్, పొన్నుస్వామి, NRSC, హైదరాబాద్ అధికారి, జె.శ్రీనివాసులు, విద్యుత్ శాఖ అధికారిణి భవ్య పాండే తదితరులు ఉన్నారు.