Saturday, November 23, 2024
HomeTrending Newsవీరవనిత మల్లు స్వరాజ్యం కన్నుమూత

వీరవనిత మల్లు స్వరాజ్యం కన్నుమూత

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఈ రోజు(ఆదివారం) నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఎనిమిది దశాబ్దాల కింద ఎర్రజెండాతో పెనవేసుకున్న ఆమె జీవితం కడవరకూ పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కర్విరాల కొత్తగూడెంలో ఓ భూస్వామ్య కుటుంబంలో ఆమె 1931లో ఆమె జన్మించారు. ఐదో తరగతి వరకే చదువుకున్న స్వరాజ్యం.. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో పోరాట పంథాలోకి వచ్చారు. 1941లో తొలిసారి ఆంధ్ర మహిళా సభ పిలుపుతో గ్రామంలోని వివిధ కులాల ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు.

ఆనాటి సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ పలు వర్గాల పీడిత ప్రజలకు మద్దతుగా నిలిచే సమయంలో తన తల్లి భీమిరెడ్డి చొక్కమ్మ అండగా నిలవడంతో ఇక తను వెనక్కి తిరిగిచూడలేదు. 1945-48 మధ్య మహోజ్వలంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించేలా సభలు నిర్వహించేవారు. ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడువందల మంది మహిళలు మేజర్ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు(1978, 1983 లలో) తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సీఎం అన్నారు. కేర్ ఆసుపత్రిలో మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్