దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సహకరించటం లేదని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల విడుదల దగ్గర నుంచి…అభివృద్ధి కార్యాక్రమాల వరకు విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపెడుతోందనే ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేంద్రంతో అమితుమి తేల్చుకునేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాష్ర్టాలకు రావాల్సిన నిధులు ఇవ్వలేని పక్షంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలని ఝార్‌గ్రామ్‌లో మంగళవారం ఓ ర్యాలీలో ఆమె డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం రాష్ర్టానికి ఉపాధి హామీ పథకం నిధులు నిలిపేసిందని, ఆ నిధుల కోసం ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ‘మా నిధులు మాకు ఇవ్వటానికి మిమ్మల్ని బిక్షం అడుక్కోవాలా?’ అని నిలదీశారు. నిధుల విడుదలపై ప్రధాని మోదీని కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.