Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవెంటాడే మాటలు

వెంటాడే మాటలు

Comments – Collections: ఇప్పుడు దేశమంతా “బాయ్ కాట్” నిరసనల డిజిటల్ ఉద్యమాల వేళ. బాలీవుడ్ కు మకుటం లేని మహారాజుల్లా ఎగిరెగిరి పడుతూ వెలిగినవారందరూ బాయ్ కాట్ గాలిలో దూది పింజల్లా ఎగిరిపోతున్నారు. లెఫ్ట్- రైట్ భావజాలాల భజనల విభజనల్లో ఎవరెటో తేలాల్సిన సమయమొచ్చేసింది. దాంతో ఎప్పుడెప్పుడో, ఎక్కడెక్కడో మాట్లాడిన ఏవేవో మాటలు మెడకు చుట్టుకుని అమీర్ ఖాన్లకు, కరీనా కపూర్లకు, కరణ్ జోహార్లకు, అనురాగ్ కశ్యప్ లకు ఊపిరి ఆడడం లేదు.

కాశ్మీరీ ఫైల్స్, కార్తికేయ కృష్ణ తత్వాలు ఇప్పుడు బాయ్ కాట్ బారిన పడని చిత్రాలు.

మహా మహా అమీర్ ఖాన్లు బాబ్బాబూ! దయచేసి నా సినిమాను బాయ్ కాట్ చేయకుండా చూడండి అని ప్రేక్షకుల కాళ్లు పట్టుకుంటున్నారు. కరీనా లాంటివారు ఏదో మాట్లాడబోయి…ఏదేదో మాట్లాడుతూ ఇంకా ఇంకా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు.

సెలెబ్రిటీలు ఏది మాట్లాడినా చెల్లుబాటయ్యే కాలం చెల్లిపోయింది. ప్రతి మాట తిరిగి తిరిగి మళ్లీ వారి దగ్గరికే వస్తోంది.

సోషల్ మీడియా వేగం, వ్యాప్తి, ప్రభావం ఇంత తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎలా మసలుకోవాలో? ఏది మాట్లాడకూడదో? ఏది ఎంత మాట్లాడాలో? ఇంకా సెలెబ్రెటీలకు అర్థమయినట్లు లేదు.

మార్కెట్ ఎప్పుడూ డిమాండ్- సప్లయ్ సూత్రం మీదే ఆధారపడి ఉంటుంది. 1990ల దాకా దూరదర్శన్ ఒకటే. తరువాత వందల టీ వీ చానెళ్లు. పదేళ్ల కిందటివరకు సినిమాలంటే థియేటర్లే. ఇప్పుడు లెక్కలేనన్ని ఓ టీ టీ లు. థియేటర్ కు వెళ్లడం ఒక అవసరం, ఒక వినోదం అన్న భావన ఎప్పుడో పోయింది. ఇంట్లో కూర్చున్నచోట కదలకుండా ఏ సినిమా అయినా చూడగలిగేప్పుడు థియేటర్లకు వెళ్లడం నిజంగా బరువు. ప్రయాస. జేబుకు చిల్లు. శిక్ష.

థియేటర్ తో పాటు తారల మీద ఆరాధన కూడా తగ్గడానికి డిజిటల్, ఓ టీ టీ లు ఒక కారణం. హద్దుల్లేని సృజనాత్మకతతో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాలతో పాటు సవాలక్ష వేదికలమీద కొత్త కొత్త సెలెబ్రిటీలు పుట్టుకొచ్చారు. తెలుగునాట ఒక బిత్తిరి సత్తికి ఉన్న పాపులారిటీ ఒక అగ్ర హీరోకు ఏవిధంగానూ తక్కువ కాదు.

థియేటర్ల సిండికేట్ కుట్రలు, కుయుక్తులు, చిన చేపలను పెదచేపలు మింగడాలు, కుల తారల సంకుల సమరాలు, వారి రాజకీయ అనుబంధాలు, పార్టీల ప్రేమలు, ప్రభుత్వాలను ఒప్పించి రాత్రికి రాత్రి టికెట్ల రేట్లు పెంచుకోవడాలు…అన్నీ ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయి. చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

కథలో హీరో చెప్పే నీతి బోధలకు ఏ అంతిమ ప్రయోజనం ఉందో? తెలిసిపోతోంది. కథలన్నీ కంచికి వెళ్లకుండా మంచి-చెడుల పంచాయతీకి వెళుతున్నాయి.

“బాయ్ కాట్” మొదట మెట్రో నగరాల్లో డిజిటల్ పక్షులకే పరిమితం. ఇప్పుడు దేశంలో మారు మూల పల్లెలు కూడా సోషల్ మీడియాతో అనుసంధానం అయ్యాయి. ఇప్పుడు ప్రతివారికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవాలి. “బాయ్ కాట్” ప్రభావం ఇంత తీవ్రమై వందల కోట్ల సినిమాలకు లక్షలు కూడా రాకపోవడానికి కారణమవుతోంది. గాలికి కృష్ణార్పణం అనుకున్న కార్తికేయ సినిమా ఉత్తరాది హిందీలోకి అనువాదమై ఒక ఊపు ఊపడానికి కారణం కూడా “బాయ్ కాట్” దెబ్బకు సమీప చిత్రాలు గాలికి కొట్టుకుపోవడమే.

తెరవెనుక జరిగే కథలు తెర ముందుకు వచ్చి చర్చలు జరుగుతున్న వేళ “బాయ్ కాట్” బారిన పడకుండా ఉండాలంటే నోరు ఎంతగా అదుపులో పెట్టుకోవాలో? గతంలో చేసిన పాపాలకు ఎంతగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో? సెలెబ్రిటీలు తెలుసుకోకపోతే…ఇంతే సంగతులు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

తోటకూర నాడే అని ఉంటే…

RELATED ARTICLES

Most Popular

న్యూస్