వెండితెర మూకీల నుంచి టాకీల దిశగా అడుగులు వేస్తున్న సమయంలో తెలుగు తెరకి పరిచమైన నటులలో చిత్తూరు నాగయ్య ఒకరు. అప్పట్లోనే ఆయనకి తెలుగు సాహిత్యంపై మంచి అవగాహన ఉంది .. పద్యాలపై మంచి పట్టు ఉంది. నాటక రంగంలో అనుభవం ఉంది. ఆ బహుముఖ ప్రజ్ఞనే సినిమాల దిశగాచిత్తూరు నాగయ్య అడుగులు వేసేలా చేసింది. ఆయనది భారీ విగ్రహమే అయినప్పటికీ, సాత్మీకమైన పాత్రలకి మాత్రమే నప్పేవారు. నిజానికి ఆయన స్వభావం కూడా అదే. అందువల్లనే మంచితనం మూర్తీభవించిన పాత్రల్లో పాలలా ఆయన ఇమిడిపోయేవారు.
జేబులో వంద రూపాయలు కూడా లేకుండా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన నాగయ్య, ఆ కాలంలోనే లక్షలు సంపాదించారు. కార్లు .. మేడలు .. విలాసాలు చూశారు. అంతకుమించిన గౌరవాలు అందుకున్నారు. సహజంగానే నాగయ్య మంచివారు .. మానవత్వం ఉన్నవారు. ఇక దానికి తోడు ఆయన ‘యోగి వేమన’ .. ‘భక్త పోతన’ .. ‘త్యాగయ్య’ .. ‘భక్త రామదాసు’ వంటి సినిమాలు చేశారు. ఆ పాత్రల ప్రభావం ఆయనపై బాగా పడింది. ‘ఏదీ శాశ్వతం కాదు .. చివరికి మిగిలేది చేసుకున్న పుణ్యమే’ అని ఆయన బలంగా భావించారు. అదే మార్గంలో ముందుకు వెళ్లారు.
నాగయ్య నటుడిగా .. నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు ఆయన ఆఫీసు కళకళలాడిపోతూ ఉండేది. అప్పట్లో ఆయన ఆఫీసు ఒక ధర్మ సత్రంలా ఉండేదని చెబుతారు. చెన్నై నగరానికి కొత్తగా అవకాశాల కోసం వచ్చినవారు అక్కడే ఆకలి తీర్చుకునేవారని అంటారు. ఇక ఎవరు ఎలాంటి సాయం అడిగినా నాగయ్యకు కాదనే అలవాటు లేదు. కొంత మొహమాటం .. మరికొంత మంచితనమే అందుకు కారణం. అలా ఆయన చాలామందికి ఆర్ధికపరమైన లావాదేవీలకు హామీ ఉన్నారు.భవిష్యత్తులో అవి తన కాళ్లకి ఎలా చుట్టుకుంటాయనే ఆయన ఆలోచన చేయలేదు.
ఒక వైపున తనకి అవకాశాలు తగ్గుతున్నాయి .. మరో వైపున నిర్మాతగా నష్టాలు వస్తున్నాయి. అయినా పట్టించు కోకుండా నాగయ్య దానధర్మాలు కొనసాగించారు. ఫలితంగా ఆయన ఆర్ధిక పరిస్థితి మరింత మందగించింది. నిర్మాతగా వచ్చిన భారీ నష్టాలు .. భాగస్వాములు చేసిన మోసాల కారణంగా ఆయన కుంగిపోయారు. కీలకమైన పాత్రల నుంచి అతిథి పాత్రలు చేసే స్థాయికి ఆయన వచ్చేశారు. అత్యధిక పారితోషికం అందుకున్న చేతులతోనే అతి తక్కువ పారితోషికాన్ని తీసుకున్నారు. తాను కనిపిస్తే దణ్ణాలు పెట్టినవారు ఎదురుపడి సాహసమే చేయడం లేదు. తనని పొగుడుతూ చుట్టూ తిరిగేవారు తనకు పిలిచినా పలకడం లేదు.
అయినా అలాంటివారిని పోషించినందుకు నాగయ్య బాధపడలేదు. జీవితంలో కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి కొంతసమయం పడుతుంది .. తనకి కాస్త ఎక్కువ సమయం పట్టిందని మాత్రమే ఆయన అనుకున్నారు. అంతకాలం సన్మానాలు .. సత్కారాలు .. కనకాభిషేకాలు కలగా కరిగిపోగా, చేదు నిజాలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసి నిస్సహాయుడిగా నిలబెట్టాయి. అందరినీ నమ్మడం మంచిది కాదు .. అతి మంచితనం కూడా హానికరమే అనేదే ఆయన చివరి రోజుల్లో అందరికీ చెబుతూ వచ్చిన మాట.