పాకిస్థాన్ రాజకీయాలు నయా దిశలో సాగుతున్నాయి. కొత్తతరం పాలకవర్గంలోకి వస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో PML(N)కు పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవటంతో ఆ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్… తన కుటుంబ సభ్యులకు కీలక పదవులు అప్పగించే పని మొదలుపెట్టారు.
సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించేలా తన సోదరుడు షహబాజ్ షరీఫ్ ను ఎంపిక చేశారు. తాజాగా కుమార్తె మరియం నవాజ్ కు పంజాబ్ ముఖ్యమంత్రి పదవి దక్కేలా చక్రం తిప్పారు. మరియమ్‌కు మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు, హుస్సేన్ నవాజ్ షరీఫ్, హసన్ నవాజ్ షరీఫ్ మరియు అస్మా నవాజ్ షరీఫ్. వాగ్ధాటి కలిగిన మరియం తన తండ్రికి ఇష్టమైనది. కాగా ఆమెను రాజకీయాల్లో వారసురాలిగా ప్రోత్సహించారు.
సీనియర్ పీఎంఎల్-ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్(50) పంజాబ్ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ బహిష్కరించింది. అయితే 220 ఓట్లు తెచ్చుకున్న మరియం పాక్‌లో ఒక రాష్ర్టానికి సీఎంగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు.
పంజాబ్ అసెంబ్లీలోని మొత్తం 371 స్థానాలకుగాను ఇటీవలే 321 మంది సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు జరిగిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన సభ్యులే విజయం సాధించారు.
మరియం నవాజ్ 1992లో సఫ్దార్ అవాన్‌ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో అతను పాకిస్థాన్ ఆర్మీలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య రిలేషన్ షిప్ బహిరంగంగా మారడంతో ఈ పెళ్లికి నవాజ్ షరీఫ్ అంగీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ ప్రధాని అయినప్పుడు ఆయనకు సెక్యూరిటీ అధికారిగా అవాన్ పనిచేశారు. మరియం-అవాన్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మరియం నవాజ్ 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. 2013లో పీఎంఎల్-ఎన్ ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అదే ఏడాది ప్రైమ్ మినిస్టర్ యూత్ ప్రోగ్రామ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆమె ఎన్నిక వివాదాస్పదం కావడంతో 2014లో పదవికి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో ఆమె పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు.
ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్థానానికి ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యత్వానికిగానీ, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యత్వానికిగానీ పోటీపడటం ఇదే తొలిసారి. పోటీ పడిన తొలిసారే ఆమె రెండు చోట్లా విజయం సాధించడం గమనార్హం.
ఇది ప్రతి మహిళకు లభించిన గౌరవంగా మరియం అభివర్ణించారు. తనను కష్టాలపాలు చేసి ధృడంగా మారేలా చేసిన ప్రత్యర్థులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వారిపై ప్రతీకారాన్ని తీర్చుకోనని పరోక్షంగా మాజీ సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బజ్వా, సీజేపీ సాకిబ్ నిసార్‌ను ఉద్దేశించి అన్నారు. మరియం ‘శాసన దొంగల రాణి’ అని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రిగా పదవీ ప్రస్థానం ప్రారంభించిన మరియం నవాజ్ అసలు లక్ష్యం ప్రధానమంత్రి పదవి. తండ్రి నవాజ్ షరీఫ్ ప్రవాస జీవితం గడిపినపుడు పాకిస్థాన్ లో పార్టీ బాధ్యతలు చేపట్టి విస్తృతంగా ప్రజలను కలిశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సింద్ రాష్ట్రం వరకు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే మరియం రాబోయే పదేళ్ళ లోపు ప్రధాని పదవి అలంకరించటం ఖాయమని పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకుల అంచనా.
-దేశవేని భాస్కర్