హైదరాబాద్ అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాదర్‌ఘాట్ సాయిబాబా ఆలయానికి సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న పూరి గుడిసెలకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. చాదర్‌ఘాట్ మీదుగా ఎంజీబీఎస్ వేళ్లే దారిలో (మూసినది ఒడ్డున) సాయి బాబా గుడి సమీపంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఇదే రహదారి మీదుగా వ్యాపారులు వెదురు బొంగులతో తయారు చేసిన బుట్టలు తదితర కర్రలతో చేసిన డేకరేషన్ సామాగ్రిని అమ్ముతూ ఉంటారు. మంటలు కాస్తా పెద్దది కావడంతో ఆ సామాగ్రి సైతం మంటల్లో కాలిపోయింది.
ఈ ప్రమాదంలో సుమారు 40 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గుడిసెల్లో ఉన్న పేదల నిత్యావసర సరకులు, నగదు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెల్లో ఉన్న రెండు సిలిండర్లు భారీ శబ్దంతో పేలడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అగ్నిప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం లేక పోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. సర్వం కోల్పోయిన గుడిసెవాసులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఘటనపై అప్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..