Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒకపరికొకపరి వయ్యారమై...

ఒకపరికొకపరి వయ్యారమై…

Unnecessary controversy: అదో సినిమా… ఒకానొక సీను… సంప్రదాయబద్ధంగా ఓ విద్వాంసుడు సామజవరగమనా అని “కూచుని” పాడబోతుంటే … “వోయ్ వోయ్ అలా పైనుండి పాడితే ఎలా.. సామజవరగమనా.. హొయ్ హొయ్… ఎన్నియల్లో ఎన్నియల్లో… హొయ్ హొయ్...  చింతాకు నడుముకు సామజ సామజ .. అల్లమో బెల్లమో కన్నె పిల్ల అందమూ” అని ఆశువుగా మార్చేసుకుని స్టేప్పులేస్తూ విజిల్స్ వేస్తూ పాడుకునే “సృజనాత్మక  ఫ్రీడమ్ ” మనకుంది. అలాంటి ‘క్రియేటివ్’ సన్నివేశాలపట్ల త్యాగయ్యకి గానీ, రామయ్యకి గానీ, వారి భక్తులకి గానీ అభ్యంతరాలు వచ్చినట్లు వినలేదు. ఎందుకంటే మన ‘తెలుగు కల్చర్’ ని ఇలాంటి సినిమా పాటలు మరింత ముందుకు తీసుకుపోతున్నాయనే సంతృప్తి అందరిలో ఏ మూలనో ఉండటం వల్లనేమో. ఠీవితో కూడిన రామయ్య మదగజ గమనాన్ని వర్ణిస్తూ త్యాగయ్య ‘సామజవర గమనా’ అంటే, నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అని హీరోయిన్ కాళ్ళ పట్ల వ్యామోహపడటం సామజవర గమనం లో మరో సినిమా మెట్టు. దాని పట్ల ఎవరూ వ్యాకుల పడినట్లు దాఖలాలు లేవు.

కాటమరాయుడా కదిరీ నరసింహుడా…
నీటైన పేరుగాడ నిన్నే నమ్మీతినోర.
బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడ.. బెట్రాయి సామి దేవుడా..”
అనే మకుటంతో ఎడ్ల రామదాసు రచించిన దశావతార వర్ణనలో
“సేప కడుపు సేరి పుట్టితీ (పుట్టితివి) ..
రాకాసివోని కోపాము తోన కొట్టితీ ( కొట్టితివి) ..
ఓపినన్ని (ఆ పెన్నేటి) నీళ్ళలోన ఎలసి ఏగాన తిరిగి…
బాపనోళ్ళ చదువులెల్ల బమ్మ దెవర కిచ్చినోడ”…

అని వేదాలను దొంగలించిన హయగ్రీవుడనే రాక్షసుడిని మత్స్యావతారంలో సంహరించిన వర్ణనను మనకు తెలియచేసే తపనలో, తన్మయత్వంలో, పైటని జార్చిమరీ పైకి లాక్కుంటూ మనకర్ధమయ్యే స్థాయిలో నడుము తిప్పుతూ స్టెప్పులు వేయడమూ వేయించడమూ మనకు సమ్మతమే. ఎందుకంటే అది మన వినోదం కోసం చెమటోడ్చి చెక్కిన ‘క్రియేటివిటీ’. అందుకే “ఆహా ఎంత చక్కటి పాట!…మనం మరిచిపోయిన పాటని మళ్ళీ గుర్తు చేశారు. తెలుగు వారిగా పుట్టడమే మన అదృష్టం !!!” అనే యూట్యూబ్ కామెంట్ల వర్షం. ఆ కామెంట్లూ ‘కళాపోషణ’లో భాగమే. ‘క్రియేటివ్ ఫ్రీడం’ ని ఎవరైనా ఏదైనా అనగలరా… అంటే…కోపాము తోన కొట్టమూ…? మళ్ళీ కొంచెం చెవుల్లో అమృతం పొసుకోవాలంటే

మంగళంపల్లి వారి గాత్రంలో సామిదేవుని తో మమేకం అవ్వాలంటే…

తను జన్మంతా వేడినా రామయ్య కనపడలేదని తపిస్తూ ఆర్తితో త్యాగయ్య “మరుగేలరా ఓ రాఘవా…” అంటూ విలపిస్తే… “అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్యా.. నిన్నేగాని మదినీ ఎన్నజాల నొరుల” అంటూ ఓ హీరోయిన్ మనసులో హీరోపై ప్రేమగా ప్రేక్షకులకు అనిపించేట్లు పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా సన్నివేశాన్ని చిత్రీకరించడమూ మనకు తెలుసు. ఇక ఈ పాట రీమిక్స్ లకి కొదవేలేదు. ఈ రీ మిక్స్ చూడండి. ఎవరికీ అభ్యంతారాలు వచ్చినట్లు వినపడలేదే. అసలు ఉచ్చారణ సరిగా లేదు. సందర్భమూ, వేషధారణ కీర్తనకు ఎలా ఒప్పాయో చూసిన వారే చెప్పాలి.

ఎంత సేపూ త్యాగయ్యేనా… ఆయన్ని మనం తమిళులకి ఎప్పుడో ఇచ్చేశాం కదా. వాళ్ళు మరు’కే’లరా అని పాడినా.. త్యాగయ్యపట్ల వారి  ఆరాధనాభావాన్ని కాదనగల సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. కాసేపు అన్నమయ్య గురించి మాట్లాడుకుందాం. అన్నమయ్య ఎన్నో శృంగార కీర్తనలు స్వామివారిపై రచించారు. మరి ఆయన జీవితంలో ఎంత శృంగారం ఉండక పొతే అది సాధ్యం అనే ఒకానొక ‘ఊహాత్మక’ (వ్యూహాత్మక?) ‘క్రియేటివ్ ఫ్రీడం’ పాయింట్ ని పట్టుకుని మన సినీ అన్నమయ్య ఇద్దరు హీరోయిన్లతో కిందా మీదా పడి మరీ మురిసి మురిపించి మెప్పించారు తెలుగు ప్రేక్షక ‘దేవుళ్ళ’ని.  అసలు అన్నమయ్య అంటే సినీ అన్నమయ్యే అన్నంతగా మరపించారు. దానికోసం ఎంత రీసెర్చ్ చేసి చర్చించి చర్చించి ‘సీన్లు’ తయారు చేసి ఉంటారో!. అందుకే మనకెవరికీ అభ్యంతరాలున్నట్లు దాఖలాలు లేవు. దానిలోనూ ఓ సినిమాటిక్ పవిత్రతే కనపడింది… కామిగాక మోక్షగామి కాడు అని వేమన ఈ సినిమా చూసే రాసి ఉంటాడని సరిపెట్టుకున్నాం (దబాయించుకున్నాం). దేవునితో పాటు మనమూ పల్లకీ మోశాం సినీ అన్నమయ్యకి. పాపము శమించుగాక!!… అన్నమయ్యని (సినీ అన్నమయ్యతో సహా) పల్లెత్తి మాట అనలేదు. అంటే.. నిక్కచ్చిగా నరకానికే… ఒక సగటు తెలుగువాడిగా సినిమానే లేకపొతే మనకు అన్నమయ్య ఎలా తెలుస్తారు?

రెండ్రోజులుగా “ఒకపరికొకపరి వయ్యారమై” అనే శ్రావణభార్గవి యూట్యూబ్ పాటపై టీవీలల్లో హోరు… “అపచారం అపచారం” అని చర్చోపచర్చలు మనోభావాలు దెబ్బతినడాలూ… మరి ఈమధ్య రెండేళ్ళ కిందట, “వాళ్ళిద్దరి మధ్యా” అనే సినిమాలో ఈ సంకీర్తనని ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు గా  … ఒకపరికొకపరి పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే.. హీరో హీరోయిన్లు ముచ్చట్లాడుకుంటూ ముద్దాడుకుంటూ … మరి అభ్యంతరాలూ టీవీ చర్చలూ వినలేదే...మనో భావాల పరిస్థితి ఏమిటో! సినిమా కాబట్టి కాబోలు.. తెలుగువారికి సరిగ్గా కనెక్ట్ అవ్వాలేగానీ ఎంతటి ‘సృజనాత్మక స్వాతంత్రాన్నై’నా ఇట్టే గట్టిగా వాటేసుకుంటాం… స్టెప్పేసుకుంటాం. సినీ మూలమిదం తెలుగు జగత్.

ఏ మాటకామాట… శ్రావణ భార్గవి మనసు పెట్టి పాడింది. ఆ మధ్య గీతా మాధురి మధురంగా ఆలపించింది. ఇక ఎమ్మెస్ అమ్మ పాటయితే చెవి కోసుకోవడమే. బాలకృష్ణ ప్రసాద్ గాత్రశుద్ధిలో మరోలోకమే. ఒక మంచి సంకీర్తన మళ్ళీ ముందుకొచ్చింది. అభ్యంతరాల గురించీ, మనోభావాల గురించి కన్నా.. పెద తిరుమలాచార్యుల వారి భక్తి కవితా పారవశ్యానికి పరాకాష్ఠ లాంటి సంకీర్తన గురించి ఓ రెండు మాటలు  మాట్లాడుకోవడం సదర్భోచితం.

సంకీర్తన : ఒకపరికొకపరి వయ్యారమై..
రచన: పెదతిరుమలాచార్య
రాగం : ఖరహరప్రియ.

ఒకపరి కొకపరి వయ్యారమై మొకమున కళలెల్ల మొలచినట్లుండె

జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి -జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాను – పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు – కరిగి యిరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహ మదము – తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె

నెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను – తరచైన సొమ్ములు ధరియించగా
మెఱుగు బోడీ అలమేలు మంగయు తాను – మెఱుపు మేఘము గూడి మెఱసినట్టుండె.

Sravana Bhargavi

జగదేకపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మేనిపై చల్లిన కర్పూర ధూళి చల్లని కాంతిలా మెరసి నలువైపులా చిందిందట. చంద్రముఖియైన అమ్మవారిని కోరి ఎదపై నిలిపాడు కాబట్టి ఆ కాంతి అమ్మనూ కమ్మేసింది. ఎలా అంటే ‘పొగరు వెన్నెల’ దిగబోసినట్లట ! అసలు ‘పొగరు వెన్నెల’ అనే ప్రయోగం ఎంత అద్భుతం !! చంద్రముఖి యైన అమ్మ వారిని కమ్మిన కాంతి పొగరు వెన్నెల దిగ బోసినట్లు ఉన్నదనడం …ఇది కదా అదృష్టమంటే.. తెలుగు వాడిగా పుట్టడం వల్ల మాత్రమే, చదివే, వినే, పొందే అదృష్టం. స్వామి వారి చెక్కిళ్ళపై పూసిన తట్టుపునుగు కరగి ఇరువైపులా కారుతోందట. అది కరిగమనయైన లక్ష్మీపతి గనుక సామజవరగమనుని నుండి మోహమదము స్రవిస్తున్నట్లుగా ఉన్నదట. స్వామివారి నల్లని మేనిపై సింగారించిన ఆభరణాలు మెరుస్తున్నాయట. నల్లని మేనిపై మెరిసే ఆభరణాలు వాటి మధ్య వక్షస్థలాన ఉన్న మెరుగుబోడియైన అమ్మవారు మెరుపులతో నిండిన నల్లని మేఘాలతో కూడినట్లున్నదట. మరి ఆ మెరుపులకు స్వామివారికి, ఒకపరి కొకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలవకుండా ఉంటాయా. ఈ సన్నివేశాన్ని ఊహించుకున్న మనకు భక్తి పారవశ్యాన రోమాంచం కలుగకుండా ఉంటుందా.

ఈ అధ్బుతమైన సన్నివేశంలో అమ్మవారి, స్వామివారల ప్రణయ సౌందర్యం పెద తిరుమలాచార్యుని  భక్తి పారవశ్యంగా చింది ఈ కీర్తన నిండా పొగరు వెన్నెల నిండినట్లు నిండి పారుతోంది. తడిసి తరించిన వారిదే అసలు అదృష్టం.

-విప్పగుంట రామ మనోహర

Also Read :

హనుమ జన్మస్థలి మీద స్వాముల వీధిపోరాటం

RELATED ARTICLES

Most Popular

న్యూస్