Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసీమ రక్తము కూడా ఎర్రగానే యుండును!

సీమ రక్తము కూడా ఎర్రగానే యుండును!

Untold story of Seema: రాయలసీమది కన్నీటి కథ – అంతు లేని వ్యథ. ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు.

వరుస కరువులు, జలవనరుల కొరత, జలదోపిడీ, పాలకుల పక్షపాతం, నిర్లక్ష్యమే సీమ దుస్థితికి కారణం.
నెలకు అయిదారువేల జీతానికి సీమ కన్నడ నేలకు, కేరళకు వలసపోతోంది. మండు వేసవిలో బిందె నీళ్లు రెండు రూపాయలనుండి అయిదు రూపాయలవరకు పెట్టి కొనలేక సీమ గొంతు తడారిపోతోంది. వేసిన వేరు సెనగ విత్తనం ఒక్క వర్షమయినా లేక చెద పురుగుల పాలవుతోంది. 60 ఏళ్ల కిందట పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వమ్ చెప్పినా, ఆ తరువాత ఎడారి కోయిలలో మధురాంతకం రాజారామ్ చెప్పినా, నిన్న మొన్న పాలగుమ్మి సాయినాథ్ చెప్పినా సీమలో మార్పు లేదు- సీమకు ఓదార్పు లేదు.

Rayalaseema

ఇలా-సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటే మీడియా మాత్రం సీమను విలన్లను చేసి, సీమ చేతిలో కత్తులు, గొడ్డళ్లు, బాంబులు పెట్టి – నరరూప రాక్షసులుగా చిత్రీకరించి అవమానిస్తోంది. సీమ యాస ఒక ఎగతాళి. సీమ సంస్కృతి ఒక బీభత్స భయానకం. సీమ పల్లె ఒక విధ్వంసం. సీమలో పంచె కట్టిన ప్రతివాడు వేటుకొక గొంతు కోసే పగవాడు. సీమ నెత్తురు పెల్లుబికే లావా. సీమ పగ వంశపారంపర్యం. సీమలో బాంబులు కుటీర పరిశ్రమ- వేటకొడవళ్లు మధ్య తరహా పరిశ్రమ – కిడ్నాపులు హత్యలు భారీ పరిశ్రమ. ఉదయాన్నే కాఫీ టీ లకు బదులు గ్లాసుల్లో అప్పుడే చంపిన మనుషుల రక్తం తాగుతారు- ఇదీ మీడియా అవగాహన. బయటి ప్రాంతాలవారికి సీమ గురించి మీడియా ఏర్పరిచిన అభిప్రాయం. ఒక ప్రాంతాన్ని గంపగుత్తగా విలన్ గా ముద్ర వేయడం బాధాకరం.

భాషా సాహిత్యాలు; కళా సాంస్కృతిక రంగాలు; విద్యా వైజ్ఞానిక, వాణిజ్య , రాజకీయ, ఇతర రంగాల్లో రాయలసీమ చరిత్ర సేవలు రాస్తే రామాయణం, చెబితే భారతం. మీడియా సీమ గొప్పను నెత్తిన పెట్టుకోండని అడగడం లేదు . సీమ కష్టాలకు కన్నీరు కార్చమని ప్రాధేయపడడం లేదు. అసలే దగా పడ్డ , శోక తప్త సీమను మీడియా వినోదంతో ఇంకా గుచ్చి గుచ్చి చంపుతోంది.

ప్రజాస్వామిక భూమికమీద ఉన్నాం. ఒకరి కన్నీళ్లు మరొకరికి వినోదం కావడం మానవ నాగరికతకే మాయని మచ్చ.

రెండున్నర గంటల సినిమాల్లో రెండు గంటలా ఇరవై అయిదు నిముషాలు సీమ గుండెను వేట కొడవళ్ళతో నరికి నరికి, చివరి అయిదు నిముషాలు శాంతి మంత్రం జపిస్తే సీమ గుండె గాయం మానుతుందా? ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంటుందా?
సీమ సహనానికి కూడా హద్దు ఉంటుంది. రాయలసీమ సంస్కృతి , భాష , ఆచార వ్యవహారాలను ఎగతాళి చేసే, కించపరిచేవారిని అడ్డుకోవాల్సిందిగా సీమ అడుక్కోవాలా?

మీడియా, సినిమా, రాజకీయ రంగాలు పదే పదే రాయలసీమ ఆత్మాభిమానాన్ని, మనసులను, సంస్కృతిని కించపరుస్తున్నాయి. గాయపరుస్తున్నాయి.

రక్తం రుచి మరిగిన నరరూప రాక్షసులు తప్ప రాయలసీమలో మనసున్న మనుషులే లేరా? పొడవండి సార్. ఇంకా లోతుగా పొడవండి. మా గుండెకు గునపం గుచ్చుకునే దాకా పొడుస్తూనే ఉండండి.
కస కస కొయ్యండి సార్. మా వ్యక్తిత్వంలో చివరి రక్తపుబొట్టు కూడా గడ్డ కట్టేంత దాకా కోస్తూనే ఉండండి.

మా సంస్కృతిని నీచంగా చిత్రీకరించే సినిమాలకోసం మా వేళ్లను మేమే కోసుకుని రక్త తిలకాలు దిద్ది, పాలాభిషేకాలు చేసి పొంగిపోయే అంతులేని ఔదార్యం మాది. మా ప్రాణాలకు ఎలాగూ విలువ ఇవ్వరు…మా మానాన్నయినా కాపాడండి చాలు.

Rayalaseema

కర్నూలు రాజకీయ నాయకుడు టి జి వెంకటేష్ గుప్తా గుప్త బంధువు, ఆయన అనుచరులు, చెంచాలు, ఆ చెంచాలకు అర, పావు చెంచాలు హైదరాబాద్ నడిబొడ్లో అత్యంత విలువయిన ఒకానొక స్థలాన్ని కబ్జా చేయబోయారంటూ…మీడియా రచించిన వార్త నిండా… రాయలసీమ రౌడీలు… రాయలసీమ గూండాలు అన్న విశేషణం విశేషంగా కనిపిస్తోంది. ఫలానా జిల్లాలో రౌడీలే లేరా? మరో ఫలానా జిల్లాలో అందరూ సర్వసంగ పరిత్యాగులయిన సన్యాసులే ఉన్నారా? మరో ఫలానా జిల్లాలో రియలెస్టేట్ మాఫియా లేనే లేదా? ఆ జిల్లాలో రాజకీయ నాయకులు చెట్లకింద తపస్సు చేసుకుంటూ నేలను చెరబట్టకుండా…కటిక నేల మీదే పడుకుంటున్నారా?

రాముడున్నప్పుడే రావణుడూ ఉన్నాడు. మంచి చెడు ఎక్కడయినా ఉంటాయి. ఒక ప్రాంతానికి అదేదో గొప్ప బిరుదుగా వాడుతున్నట్లు పదే పదే అదే మాటతో సంబోధించడం మాత్రం ఆక్షేపణీయం. రాయలసీమ రౌడీలకు నిలయమయినట్లు చిత్రీకరించడంలో కొందరి ఆధిపత్య ధోరణి, రాజకీయ స్వార్థం, సాటి సమాజం పట్ల సానుభూతి లేని కొందరి సంస్కార రాహిత్యం, కళ్లున్నా నిజమయిన రాయలసీమ గుండెను చూడలేని కొందరి అంధత్వం…సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని మరికొన్ని కారణాలున్నాయి.

సీమకు కళ్లున్నాయి- చూస్తోంది.
సీమకు చెవులున్నాయి- వింటోంది.
సీమకు మనసుంది- కలతపడితే కన్నీళ్లున్నాయి.
సీమకు అన్నీ అర్థమవుతున్నాయి.

దిద్దుబాటు కొసమెరుపు:
రాయలసీమ రౌడీలు అంటూ మొదటి రోజు కుమ్మిపారేసిన ఆంధ్రజ్యోతి…రెండో రోజు ఫాలో అప్ వార్తలో మాత్రం తప్పును దిద్దుకుని…రాయలసీమకు చెందిన ఫలానా నాయకుల ఫలానా అనుచరులు అని ప్రస్తావించింది. తనకు తానే సవరించుకుని ఉన్నా, ఎవరయినా చెబితే సవరించుకుని ఉన్నా…ఎలా అయినా…దిద్దుబాటు మంచిదే.

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి : 

హంతక పురాణం

ఇవి కూడా చదవండి :  

పెన్నావతరణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్